Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు నిర్వహణకే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వరించిన ఘన విజయంతో, సూపర్ సిక్స్ పథకాల అమలు ఊపుతో మూడు నెలల ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని భావించింది. ఆ మేరకే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తును మొదలు పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల పరిధిలోని ఓటర్ల జాబితాలను సేకరించింది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల వారీగా వాటి జాబితాలను సిద్ధంచేసే పనిలో ఉన్నది.
Local Body Elections: ఈ మేరకు మున్సిపల్, పంచాయతీల వారీగా మాస్టర్ ట్రైనీలకు శిక్షణా శిబిరాలు కూడా ఎన్నికల సంఘం నిర్వహించింది. రిజర్వేషన్లను ఖరారు చేసిన వెంటనే ఎన్నికల షెడ్యూల్, ఆ వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉన్నది. ఈ నేపథ్యంలోనే పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణను ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహాని కలవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
Local Body Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ హయాంలో 2021 ఫిబ్రవరి, మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ప్రకారం సర్పంచుల పదవీకాలం 2026 ఏప్రిల్ నెలలో, నగరపాలక, పురపాలక సంస్థల చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం 2026 మార్చిలో ముగుస్తుంది. ఆ ప్రకారం అయితే ఆయా ఎన్నికలను మే, జూన్ నెలల్లో జరగాల్సి ఉన్నది. కానీ మూడు నెలలు ముందుగానే అంటే 2026 జనవరి నెలలోనే ఆయా పాలకవర్గాలకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.
Local Body Elections: ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోరుగా సన్నహాలు సాగుతున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లను చేపట్టాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్, పురపాలక శాఖల ఉన్నతాధికారులకు ఎన్నికల కమిషనర్ సూచించారు. 2026 జనవరి నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి, అదే నెలలో ఫలితాలను ప్రకటించాలని ఎన్నికల సంఘం సంసిద్ధమై ఉన్నది. ఈ నేపథ్యంలో డిసెంబర్ చివరి వారంలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నది.

