Nara Bhuvaneshwari: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో సాధారణ మహిళలా మారి అందరిని ఆశ్చర్యపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని స్వయంగా పరిశీలించేందుకు ఆమె శాంతిపురం నుంచి తుమ్మిసి గ్రామం వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సులో ఎక్కి, తన ఆధార్ కార్డు చూపించి ఉచిత టికెట్‌ను పొందారు.
బస్సు ప్రయాణంలో పక్కనే కూర్చున్న మహిళలతో మాట్లాడి, పథకం వల్ల వారికి ఎంత లాభం కలుగుతోందో అడిగి తెలుసుకున్నారు.అనంతరం తుమ్మిసి పెద్ద చెరువు వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుప్పం ప్రజల దశాబ్దాల కల అయిన కృష్ణా జలాలను ప్రాంతానికి రప్పించడం చంద్రబాబుదేనని, ఆయన లక్ష్యం కుప్పం ప్రాంతంలో నీటి సమస్యలు పూర్తిగా తీరాలని తెలిపారు.
కేవలం నీటి సమస్యల పరిష్కారమే కాకుండా, రూ. 23 వేల కోట్ల పెట్టుబడులతో ఏడు పరిశ్రమలను కుప్పానికి తీసుకురావడంలో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారని, వీటిలో మూడు పరిశ్రమలు మహిళల ఉపాధి, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని వివరించారు. పరిశ్రమలు, పర్యాటక రంగ అభివృద్ధి వంటి అంశాల ద్వారా కుప్పం ప్రగతికి చంద్రబాబు చేసిన సేవలు చాలా గొప్పవని భువనేశ్వరి పేర్కొంటూ, కుప్పం ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనతో ఉండాలని ఆకాంక్షించారు.

