Etala Rajendar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటమిపై పార్టీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం ఓటమికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ గత ఆరు నెలల నుంచే ప్రచార పనులు ప్రారంభించగా, బీజేపీ మాత్రం చివరి దశలోనే అభ్యర్థిని ప్రకటించిందని గుర్తుచేశారు.
ఉప ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన బీజేపీ బలహీనపడిందని చెప్పడం సరికాదని ఈటల వ్యాఖ్యానించారు. హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయినా తరువాత అధికారంలోకి వచ్చిందని ఉదాహరించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జరిగిన తొమ్మిది ఉప ఎన్నికల్లో ఏడింటిలో అధికార పార్టీ గెలిచిందని, రెండింటిలో బీజేపీ విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డబ్బులు, చీరలు పంపిణీ చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఈటల ఆరోపించారు. హైదరాబాద్‌లో పాలనా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. నగర జనాభాకు సరిపోయే విధంగా డ్రైనేజీ, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణను బలోపేతం చేయాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నగర సమస్యలు వివరించనున్నట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న రెండు పడకగదుల ఇళ్లను వెంటనే కేటాయించాలని, పేదల ఇళ్లను కూల్చివేయకుండా చూడాలని డిమాండ్ చేశారు.

