R. Krishnaiah: పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని, చట్టపరంగా రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆదివారం బీసీల హక్కుల కోసం న్యాయసాధన దీక్షలో భాగంగా ఆయన హైదరాబాద్లోని ఇంద్రపార్క్ వద్ద దీక్ష నిర్వహించారు.
బీసీ సమాజానికి న్యాయం చేయాలని, ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే రాష్ట్రంలో యుద్ధ వాతావరణం ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించే యత్నాలు జరిగితే చూస్తూ ఊరుకోమని, తమ శక్తిని చూపిస్తామని హెచ్చరించారు.
పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్లడం ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం మాత్రమేనని, గతంలో తాను కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లు గుర్తుచేశారు. పార్టీ ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తే అనేక వివాదాలు తలెత్తుతాయని పేర్కొన్నారు.
“మాకు భిక్షం వద్దు… రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వాలి” అంటూ కృష్ణయ్య డిమాండ్ చేశారు.

