Chandrababu Naidu: భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీజేఐకి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత రాజ్యాంగ గొప్పదనం, దేశ ఆర్థిక పురోగతి, మరియు సోషల్ మీడియా వల్ల వస్తున్న సవాళ్లపై కీలక ప్రసంగం చేశారు.
సీజేఐ గవాయ్ ‘విలువలతో కూడిన వ్యక్తి’
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. “సీజేఐ జస్టిస్ గవాయ్ విలువలతో కూడిన వ్యక్తి. అందరినీ సమానంగా చూడటం ఆయన గొప్ప లక్షణం” అని కొనియాడారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని గుర్తుచేస్తూ, “మనం ఈ స్థానాల్లో ఉన్నామంటే కారణం మన రాజ్యాంగమే” అని తెలిపారు. ధనిక, పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత రాజ్యాంగానికే దక్కుతుందని సీఎం పేర్కొన్నారు. “మన రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచింది. ఒక చాయ్‌వాలాను దేశ ప్రధానిని చేసిన ఘనత ఈ రాజ్యాంగానికే దక్కుతుంది అన్నారు
ఇది కూడా చదవండి: Viral Video: చావు అంచుల దాకా వెళ్లొచ్చాడు.. కదులుతున్న రైలు కింద పడుకున్న వ్యక్తి
ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా భారత్ లక్ష్యం
దేశం సాధించిన ఆర్థిక ప్రగతిని ప్రస్తావిస్తూ, ప్రపంచంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు. 90వ దశకంలో వచ్చిన ఐటీ విప్లవాన్ని భారత్ అందిపుచ్చుకుందని, ప్రపంచం మొత్తానికి ఇండియా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ నిపుణులను ఇచ్చిందని గుర్తు చేశారు. 2014లో ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానంలో ఉన్న భారత్, ఇప్పుడు 4వ స్థానానికి చేరుకుంది.
భవిష్యత్తు లక్ష్యాలు:
వచ్చే ఏడాది (2026 నాటికి) ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుంది. 2038 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగనుంది. 2047 నాటికి (స్వతంత్ర భారతం 100 ఏళ్లు) ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవనుంది.
“నేను నిత్యవిద్యార్థిని. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉంటా. దేశంలో ఎన్నో పబ్లిక్ పాలసీలను, ఎకనామిక్ సంస్కరణలను దశాబ్దాలుగా చూశాను. భవిష్యత్తులో కూడా హ్యూమన్ రిసోర్స్‌ను ప్రపంచానికి భారత్ అందిస్తుంది” అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా సవాళ్లు: ప్రతి ఒక్కరూ ఎడిటర్లే
పత్రికలు, ఆల్ ఇండియా రేడియో శకం నుంచి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా శకం నడుస్తోందని సీఎం అన్నారు.”ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఎడిటర్, రైటర్ అయ్యారు. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దాని వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అందరి క్యారెక్టర్‌ను అతనే డిసైడ్ చేసే పరిస్థితి నెలకొనడంతో అందరం ఇబ్బంది పడుతున్నాం. దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది” అని చంద్రబాబు సవాళ్లను ప్రస్తావించారు.

