Konda Surekha:సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై తాను చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంపై రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అటు సినీవర్గాల్లో, ఇటు రాజకీయ రంగంలో ఆసక్తికరంగా మారింది. అర్ధరాత్రి ఎక్స్‌లో ట్వీట్ చేయడం.. ఇప్పటి వరకూ నాగార్జున కానీ, ఆయన కుటుంబం కానీ స్పందించకపోవడంపై ఉత్కంఠ నెలకొన్నది.
Konda Surekha:అయితే ఆమె క్షమాపణల వెనుక బలమైన కారణం ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు. మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తూ, నాగార్జున కుటుంబాన్ని లాగింది. అప్పటి ఆయన కోడలు, ప్రముఖ సినీనటి సమంతపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై అటు నాగార్జున కుటుంబం, ఇటు కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ ఇద్దరూ పరువు నష్టం దావా వేశారు.
Konda Surekha:మంత్రి సురేఖపై నాగార్జున వేసిన పరువునష్టం కేసు రేపు కోర్టులో విచారణకు రానున్నది. కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వస్తుందని ఆమెకు విశ్వసనీయ సమాచారం ఉన్నట్టు తెలుస్తున్నది. అందుకే రాత్రికి రాత్రి క్షమాపణలు కోరుతూ పోస్టు చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి కేసుల్లో ఎవరైనా క్షమాపణలు చెప్పకపోతే, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించకపోతే కోర్టు తన తీర్పు వెల్లడిస్తుందని తెలుస్తున్నది. ఇప్పుడు ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో నాగార్జున కుటుంబం సంతృప్తి చెందితే ఈ కేసులో రాజీ పడే అవకాశం లేకపోలేదు. అందుకే ఆమె రాత్రికి రాత్రే క్షమాపణలు కోరినట్టు చెప్తున్నారు.

