Crime News: క్రికెట్ బెట్టింగ్ అనే వ్యసనం చాలా మంది యువకులను అప్పుల పాలు చేస్తోంది. కొందరు చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్న విషాద ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా, అలాంటిదే ఒక హృదయవిదారక సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని, అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు ఓయో రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆ యువకుడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
తండ్రికి ఫోన్ చేసి.. ప్రాణం తీసుకున్నాడు!
సంఘటన వివరాల్లోకి వెళ్తే… సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం పీఎస్ పరిధిలోని బీరంగూడ కమాన్ పక్కన ఉన్న లావీ షోక్ ఓయో రూమ్‌లో అఖిల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 10వ తేదీన ఓయో రూమ్‌కు వెళ్లిన అఖిల్, తన తండ్రి సంగీత్ రావుకు ఫోన్ చేశాడు. తాను క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పెట్టి మోసపోయానని, బెట్టింగ్‌ల కోసం చాలా మంది దగ్గర అప్పులు చేశానని తండ్రికి చెప్పుకుని ఏడ్చాడు. ఆ తర్వాత, తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన గురించి ఎవరూ బాధపడొద్దని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
ఓయో రూమ్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అఖిల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఓయో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం తరలించారు. అఖిల్ తండ్రి సంగీత్ రావు, కుటుంబ సభ్యులు ఆర్సీపురం సాయినగర్‌లో నివాసం ఉంటున్నారు. కన్నకొడుకు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.

