Nadendla manohar: పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ 2025–26 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సచివాలయంలో రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ధాన్యం సేకరణ అనంతరం బియ్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గోడౌన్లను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖకు 20 లక్షల మెట్రిక్ టన్నులు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి 14 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 34 లక్షల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యం నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ గత ఏడాది కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ ధాన్యం కొనుగోళ్లలో చారిత్రాత్మక విజయం సాధించిందని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఈ సీజన్‌లో కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. డ్రైయర్లు ఉన్న రైస్ మిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ధాన్యం మిల్లింగ్ మరియు నిల్వ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని ఆదేశించారు.
అక్రమాలకు తావులేకుండా ప్రతి గోడౌన్ వద్ద నిఘా కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లాల వారీగా రైస్ మిల్లర్లు 1:2 నిష్పత్తిలో బ్యాంక్ గ్యారంటీలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సుమారు 35 బ్యాంకులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి సూరిబాబు మరియు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

