Fee Reimbursement:

Fee Reimbursement: ఆగ‌ని ఫీజు పోరు.. స‌గం బ‌కాయిలు ఇవ్వాల్సిందేన‌ని ఫ‌తి డిమాండ్‌

Fee Reimbursement: సుమారు రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకుండా రాష్ట్ర సర్కారు మోసానికి పాల్పడింద‌ని ప్రైవేటు క‌ళాశాల‌ల యాజ‌మాన్యాలు మండిప‌డుతున్నాయి. ఒక‌వైపు న‌వంబ‌ర్ 3 నుంచి క‌ళాశాల‌ల నిర‌వ‌ధిక బంద్ పాటిస్తుండ‌గా, మ‌రోవైపు స‌ర్కారు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ నిధుల విడుద‌ల‌పై ఒక క‌మిటీని ఏర్పాటు చేసింది. దానికి మూడు నెల‌ల గ‌డువును విధించింది. త‌మ పోరాటాన్ని చ‌ల్లార్చేందుకే స‌ర్కార్ క‌మిటీ పేరిట‌న కాల‌యాప‌న‌కు పూనుకున్న‌ద‌ని ఫెడ‌రేష‌న్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హ‌య్య‌ర్ ఇన్‌స్టిట్యూష‌న్స్ (ఫ‌తి) ఆరోపిస్తున్న‌ది. ఇదిలా ఉండ‌గా, కాలేజీలు బంద్ చేసి యాజమాన్యాలు సమ్మెకు దిగడంతో విద్యార్థులు చదువుల‌కు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొన్న‌ది.

Fee Reimbursement: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇత‌ర పేద విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ త‌ర్వాత సాఫీగానే ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బ‌కాయిలు కాలేజీల‌కు అందాయి. కానీ, 2023లో అధికారంలోకి వ‌చ్చిన‌ రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హ‌యాంలో పెండింగ్ బ‌కాయిలు పేరుకుపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెల్లించాల్సిన ఫీజులతోపాటు గతంలోని బకాయిలను చెల్లించకుండా కాలేజీలను ఇబ్బందులకు గురి చేస్తోంది.

Fee Reimbursement: ఓవైపు ఇంజనీరింగ్, ఫార్మసీ, బీఈడీ వంటి కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ ఫీజును రీయింబర్స్ మెంట్ రూపంలో ప్రభుత్వమే చెల్లిస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. విద్యార్థులు తాము చెల్లించాల్సిన మిగిలిన ఫీజు చెల్లించారు. కానీ, సర్కారు చెల్లించాల్సిన ఫీజు చెల్లించకపోవడంతో.. కోర్సు పూర్తయినా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ఫలితంగా విద్యార్థులు పై చదువులు చదువుకునేందుకు అర్హత కోల్పోయే పరిస్థితి నెలకొంటోంది. దీంతో వారి భవిష్యత్తే అంధకారంగా మారే ప్రమాదం ఏర్పడింది.

Fee Reimbursement: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల‌ను ప్రభుత్వం చెల్లించక, విద్యార్థులు చెల్లించే పరిస్థితి లేక కాలేజీ యాజమాన్యాలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులను గట్టిగా అడగలేక, ప్రభుత్వాన్ని అడిగినా పట్టించుకోక చివరికి కాలేజీలు నడపలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా దాటవేత ధోరణే తప్ప.. బకాయిలు మాత్రం చెల్లించడంలేదు. ఒకటికి నాలుగుసార్లు సర్కారు వద్దకు వెళ్లడంతో చివరికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నేతృత్వంలో మంత్రుల కమిటీని నియమించారు.

Fee Reimbursement: ఆ కమిటీ కాలేజీల యాజమాన్యాలకు పలుమార్లు హామీలిచ్చారు. కానీ, ఏవీ ఆచరణకు నోచుకోలేదు. గత బకాయిలకు తోడు ఈ విద్యా సంవత్సరం ఫీజులు కూడా కలుపుకొని బకాయిలు మొత్తం రూ.10 వేల కోట్లకు చేరుకున్నాయి. దీంతో దసరా పండుగకు ముందు తెలంగాణ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సమాఖ్య (ఫ‌తి) ప్రతినిధులు ఫీజులు చెల్లించకపోతే తాము సమ్మెకు దిగుతామని ప్రకటించారు. దీంతో వారిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలిపించి చర్చలు జరిపారు.

Fee Reimbursement: కాలేజీలు సమ్మె లాంటి నిర్ణయం తీసుకోవద్దని భట్టి విక్రమార్క సూచించడంతో.. అప్పటికే తమకు బకాయిల చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం టోకెన్లు ఇచ్చిందని, ఆ మేరకైనా తక్షణమే చెల్లించాలని ఫ‌తి ప్రతినిధులు కోరారు. అందుకు అంగీకరించిన డిప్యూటీ సీఎం రెండు రోజుల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే దసరా పండుగకు ముందు చెల్లించకపోగా, దీపావళి కూడా దాటిపోయింది. కానీ, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకుండా పోయింది. పైగా, ఫీజులు అడిగిన పాపానికి కాలేజీలపై విజిలెన్స్ దాడుడు చేయించి భయపెట్టాలని చూసింది. దీంతో కాలేజీలు ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చి ఈ నెల 3వ తేదీ నుంచి బంద్ పాటిస్తున్నాయి.

Fee Reimbursement: రాష్ట్ర వ్యాప్తంగా 1,800 కాలేజీలు ఈ బంద్ లో పాలుపంచుకుంటున్నాయి. దీంతో విద్యార్థుల చదువు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అయినా.. ఇప్పటికీ మభ్యపెట్టే ప్రయత్నమే తప్ప సమస్యను పరిష్కరించాలనే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేయడంలేదు. పైగా, విద్యాశాఖ సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉన్నా ఆయన స్పందించడంలేదు. దీనిపై కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ నిరసనను మరింత ఉధృతం చేసే యోచనలో ఉన్నాయి.

Fee Reimbursement: ఇది మున్ముందు మరెంత దూరం వెళుతుందో చూడాల్సి ఉంది. బ‌కాయి ఉన్న సుమారు రూ.10,000 కోట్ల బ‌కాయిల్లో స‌గ‌మైన రూ.5,000 కోట్లు చెల్లించేదాకా తాము పోరాటం కొన‌సాగిస్తామ‌ని ఫ‌తి స్ప‌ష్టం చేస్తున్న‌ది. మిగ‌తా రూ.5,000 కోట్ల బకాయిల‌ను కూడా నెల‌కు రూ.500 కోట్ల చొప్పున 10 నెల‌ల్లోగా చెల్లించేలా స‌ర్కార్ హామీ ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో అటు సర్కారు.. ఇటు కాలేజీ యాజ‌మాన్యాల అసోసియేష‌న్ ప్రతినిధులు ప‌ట్టు వీడేలా లేరు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *