Nadendla manohar: ధాన్యం కొనుగోలు పై మంత్రి నాదెండ్ల ఏమన్నారంటే? Nadendla manohar: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే నిజమైన న్యాయం జరుగుతోందని ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు, రైతులకు చెల్లింపులు, రేషన్ పథకాలపై మంత్రి వివరాలు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు • ఈ సీజన్లో రూ.12,200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు • రాష్ట్రవ్యాప్తంగా 4,041 రైతు సేవా కేంద్రాలు, 3,803 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు • 16,700 మంది సిబ్బంది మోహరింపు • ఆరుబయట ధాన్యం నిల్వకు 6 కోట్ల గోతాల సిద్ధం గత ప్రభుత్వం రైతులకు రూ.1,670 కోట్లు బకాయిలుగా వదిలిపెట్టిందని నాదెండ్ల విమర్శించారు. తమ ప్రభుత్వం వస్తూనే 87 శాతం ధాన్య రుసుములను 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు గుర్తుచేశారు. ఈ సారి చెల్లింపు సమయాన్ని 24 గంటలకు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. తేమ కొలతలో పారదర్శకత కోసం ఒకే కంపెనీ యంత్రాలు వినియోగం, బ్లూటూత్ రీడింగ్ వ్యవస్థను కూడా ప్రస్తావించారు. వాట్సాప్ ద్వారా షెడ్యూల్ చేసుకునే సౌకర్యం రైతులకు అందుబాటులో ఉందని తెలిపారు. కొత్త పథకాలు • జనవరి నుంచి రేషన్ కార్డుదారులకు కిలో గోధుమపిండి రూ.18కి పంపిణీ • ఇందుకోసం 2,400 మెట్రిక్ టన్నుల గోధుమపిండి సిద్ధం • వర్షాల నేపథ్యంలో రైతులకు 50 వేల టార్పాలిన్లు ఉచితంగా పంపిణీ ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్ భరోసా ఈ క్రాప్ నమోదు చేస్తే ధాన్యం కొనరు అనే ప్రచారాన్ని మంత్రి ఖండించారు.నమోదైన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.ఇప్పటికే 39.51 లక్షల ఎకరాల్లో ఈ-క్రాప్ నమోదు పూర్తైందని, 85 లక్షల ఎంఎల్టి దిగుబడిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై కార్పొరేషన్ వైస్ చైర్మన్&ఎండీ ఢిల్లీ రావు, డైరెక్టర్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు