India- China: వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి శాంతి, సుస్థిరతను కొనసాగించడానికి ఇప్పటికే ఉన్న యంత్రాంగాలను ఉపయోగించాలని భారత్ , చైనా దేశాలు అంగీకరించాయి. తూర్పు లడఖ్‌లోని సరిహద్దు పరిస్థితిపై ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరిగిన అనంతరం ఈ విషయాన్ని విదేశాంగ శాఖ (MEA) ధృవీకరించింది. అక్టోబర్ 25న చుషుల్-మోల్డో సరిహద్దు పాయింట్ వద్ద ఈ 23వ రౌండ్ కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు భారతదేశ భూభాగంలో జరిగాయి. చర్చలు స్నేహపూర్వక, సౌహార్దపూర్వక వాతావరణంలో జరిగాయని విదేశాంగ శాఖ తెలిపింది. అక్టోబర్ 2024లో జరిగిన 22వ రౌండ్ చర్చల నుంచి సాధించిన పురోగతిని ఇరుపక్షాలు సమీక్షించుకున్నాయి. సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత కొనసాగుతోందని సంతృప్తి వ్యక్తం చేశాయి.
సరిహద్దు వెంబడి తలెత్తే ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి, సుస్థిరతను కొనసాగించడానికి ఇప్పటికే ఉన్న సైనిక, దౌత్య మార్గాలను ఉపయోగించడం కొనసాగించాలని ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. 2020లో గాల్వాన్ లోయ ఘర్షణల తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల పాటు తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి.
ఇది కూడా చదవండి: Australia: క్రికెట్ ఆస్ట్రేలియాకు $7 మిలియన్ల నష్టం!
అయితే, గత ఏడాది అక్టోబర్‌లో ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన కీలక ఏకాభిప్రాయం తర్వాత సంబంధాలను సాధారణీకరించడానికి భారత్, చైనా అనేక చర్యలు ప్రారంభించాయి. గతేడాది అక్టోబర్‌లో దెమ్‌చోక్, దెప్సాంగ్ వంటి చివరి ఘర్షణ పాయింట్ల నుంచి కూడా బలగాల ఉపసంహరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.
ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మధ్య జరిగిన ప్రత్యేక ప్రతినిధుల చర్చల తర్వాత జరిగిన మొదటి సైనిక స్థాయి సమావేశం ఇది. నాయకుల మధ్య కుదిరిన ముఖ్యమైన ఏకాభిప్రాయం మార్గదర్శకత్వంలో సైనిక, దౌత్య ఛానెల్‌ల ద్వారా కమ్యూనికేషన్, చర్చలను కొనసాగించాలని ఇరు పక్షాలు నిర్ణయించుకున్నాయి. ఘర్షణ పాయింట్ల నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ, తూర్పు లడఖ్ ప్రాంతంలోని సరిహద్దు వెంబడి ఇరువైపులా ఇంకా 50,000 నుంచి 60,000 మంది సైనికులు మోహరించి ఉన్నారు. పూర్తి స్థాయి ఉద్రిక్తతలను తగ్గించడం ఇంకా పెండింగ్‌లో ఉంది.

