TDP Bhima for Bus Accident Victims: హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ బస్సు కర్నూలు వద్ద జాతీయ రహదారిపై ఘోర అగ్ని ప్రమాదానికి గురైన భయంకరమైన ఘటన అందరినీ తీవ్ర విషాదంలోకి నెట్టేసిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 44 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అవ్వగా.. మృతుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిన వారు ఇద్దరున్నట్లు గుర్తించారు. వారు నెల్లురుకు చెందిన గొల్ల రమేష్, ఆయన భార్య గుత్తా అనూష కాగా, వారి కుటుంబాలకు టీడీపీ భీమా అండగా నిలిచింది. దంపతులు రమేష్, అనూషలు నమోదిత టీడీపీ సభ్యులుగా ఉన్నట్లు గుర్తించిన వెంటనే.. పార్టీ సూపర్ ఫాస్ట్‌గా స్పందించి టీడీపీ సభ్యత్వంతో వచ్చే ఉచిత ప్రమాద బీమాను ప్రాసెస్ చేసింది. టీడీపీ సభ్యత్వానికి అధికారిక బీమా భాగస్వామి అయిన యునైటెడ్ ఇన్సూరెన్స్‌ను పార్టీ కార్యకర్తలు సంప్రదించి ఆరు గంటల్లోనే ప్రక్రియను పూర్తి చేశారని తెలుస్తోంది. దీంతో ఈ పాటికే వారి కుటుంబాలకు డబ్బు అందేదే కానీ.. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో సోమవారం నాటికి డబ్బు జమ అవుతుందని చెబుతున్నారు. దంపతుల నామినీలుగా ఉన్న గొల్ల మాలకొండయ్య, గుత్తా ధనమ్మలకు చెరో ఐదు లక్షలు జమచేస్తారు. టీడీపీ సభ్యత్వం పొందిన వారికి రూ.5 లక్షల ఉచిత ప్రమాద బీమా సదుపాయం ఉందన్న సంగతి తెలిసిందే.
Also Read: Kurnool Bus Accident: వీడిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ
ఇక ఈ ప్రమాద ఘటనలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయి సహాయం అందించనున్నట్లు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మూడు రాష్ట్రాల మంత్రులతో మాట్లాడి… ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం రెండు లక్షల రూపాయలు, అలాగే మరణించిన కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

