Cyber scam: జనాలని ఎట్లా మోసం చేయాలని రోజుకో కొత్తదారి వెతుక్కుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. మనుషులని ఎలా బుట్టలో వేసుకోవాలి వారి నుంచి డబ్బులు ఎలా లాగానే దానిమీద పీహెచ్‌డీలు చేస్తున్నారు. రోజుకో విధంగా ఘరానా మోసం చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. మీరు బారిన పడకుండా ఉండకు ప్రభుత్వాలు పోలీసులు ప్రజలకు ఎంత చెప్పినా గాని ఏదో ఒక విధంగా ఈ మాయగాల్ల మూటలో పడిపోతున్నారు. సైబర్ నేరగాళ్లు జనాన్ని మోసం చేసేందుకు కొత్త దారులు ఎంచుకుంటున్నారు.
పొరపాటున మీ అకౌంట్‌కు డబ్బులు పంపించామని చెబితే నమ్మారో.. ఇక అంతే సంగతులు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి చిన్న మొత్తంలో డబ్బులు పంపించి.. పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేశారు కేటుగాళ్లు. అసలేం జరిగిందంటే.. ఏలూరులోని అశోక్‌నగర్‌కు చెందిన శేషగిరి ఖాతాకు గుర్తు తెలియని వ్యక్తులు రూ.20 వేలు పంపారు. పొరపాటున డబ్బులు జమ చేశామని.. తిరిగి తమ ఖాతాకు పంపాలని ప్రాధేయపడి అడిగారు.
ఆ మాటలు నమ్మిన శేషగిరి తిరిగి ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించారు. ఈ క్రమంలోనే శేషగిరి ఈ నెల 10న తన అకౌంట్ పరిశీలించగా.. రూ.46 లక్షలు విత్‌డ్రా అయినట్లు చూపించింది. వెంటనే శేషగిరి పోలీసులను ఆశ్రయించారు. రూ.20 వేలు పంపగానే రూ.46 లక్షలు దోచేశారని తెలిసింది. ఏలూరు టూ టౌన్ సీఐ వైవీ రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ కేటుగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.