Bhumana Karunakar Reddy: తిరుపతి రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి తిరుపతి పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీటీడీ గోశాలలో వందకుపైగా ఆవులు చనిపోయాయన్న ఆయన చేసిన సంచలన ఆరోపణలపై పోలీసులు విచారణకు పిలిచారు.
గతంలో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోశాలలో భారీ స్థాయిలో గోవులు మరణించాయని, అది నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. కూటమి ప్రభుత్వం పాలనలో ఇంత పెద్ద సంఘటన ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. అయితే టీటీడీ అధికారులు, కూటమి నేతలు మాత్రం భూమన ఆరోపణలను ఖండిస్తూ అవి పూర్తిగా అసత్యమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి భూమనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఆరోపణలు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశ్యంతో ఉన్నాయని ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భూమనపై బీఎన్ఎస్ యాక్ట్‌లోని 353(1), 299 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్‌లోని 74 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజాగా ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తూ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అధికారులు భూమనకు సమన్లు జారీ చేశారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. గోవుల మృతిపై చేసిన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు సమర్పించాలని ఆయనను కోరారు. విచారణకు హాజరుకాకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: తెలంగాణ పోలీసింగ్ దేశానికే ఆదర్శం.. ప్రమోద్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేషియా
ఇక వైసీపీ మాత్రం దీనిపై తీవ్రంగా స్పందించింది. భూమన కరుణాకర్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో వ్యవహరిస్తోందని విమర్శించింది. గోశాల ఘటనలో ఉన్న లోపాలను వెలుగులోకి తేవడమే భూమన ఉద్దేశమని, ఆయనపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైసీపీ నేతలు మండిపడ్డారు.
ఇక భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని పునరుద్ఘాటించారు. “ఆవుల మరణాలపై నాకు ఉన్న ఆధారాలు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాను” అని ఆయన పేర్కొన్నారు.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే – భూమన ఆరోపణలు నిజమని తేలుతాయా? లేక టీటీడీ నిర్ధోషిగా బయటపడుతుందా? విచారణ తర్వాత ఈ వివాదంపై స్పష్టత రానుంది. ఏది ఏమైనా, తిరుపతి రాజకీయాలు ఈ గోశాల కేసుతో మరోసారి వేడెక్కడం ఖాయం.