Nara lokesh: ఆస్ట్రేలియాలోని సిడ్నీ న్యూసౌత్‌వేల్స్ పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఆస్ట్రేలియా–ఇండియా బిజినెస్ కౌన్సిల్ (AIBC) రోడ్‌షోలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మూడు ప్రధాన కారణాలు వివరించారు.
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
అనుభవజ్ఞుడైన నాయకత్వం – యువత ఉత్సాహం
లోకేశ్ మాట్లాడుతూ, “మా రాష్ట్రానికి అనుభవం కలిగిన నాయకత్వం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు 50 శాతం యువ ఎమ్మెల్యేలతో కూడిన మంత్రివర్గం రాష్ట్ర పునర్నిర్మాణంపై కృషి చేస్తోంది” అని చెప్పారు.
‘ఈజ్’ కాదు… ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’
“మేము ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కాదు, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను చూపిస్తున్నాం. గూగుల్ డేటా సెంటర్ విశాఖలో 13 నెలల్లో పూర్తైంది. ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పరచాం. 16 నెలల్లో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి” అని లోకేశ్ వెల్లడించారు.
స్టార్టప్ స్టేట్‌గా ఆంధ్రప్రదేశ్
“ఆంధ్రప్రదేశ్ ఒక స్టార్టప్ స్టేట్. మాకు పెట్టుబడుల కోసం ఆకలి ఉంది, వేగంగా పనిచేయాలనే తపన ఉంది. రాష్ట్రాల మధ్య పోటీ ఉంటేనే భారత్ గెలుస్తుంది. ఈ న్యూ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ కూడా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రం తెచ్చిన కార్మిక సంస్కరణల్లో తొమ్మిదింటిలో ఎనిమిది సంస్కరణలను కేవలం 15 రోజుల్లో అమలు చేశామని, సంస్కరణల ద్వారానే అడ్డంకులు తొలగుతాయని చంద్రబాబు విశ్వసిస్తారని లోకేశ్ తెలిపారు.
🏗️ పెట్టుబడులకు ఆహ్వానం
విశాఖ సదస్సులో పాల్గొని ఏపీ అవకాశాలను పరిశీలించాలని ఆస్ట్రేలియా పెట్టుబడిదారులను నారా లోకేశ్ ఆహ్వానించారు.