Br naidu: మంగళగిరి సమీపంలోని వెంకటపాలెం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మికంగా సందర్శించారు. ఆలయంలోని పరిశుభ్రత, సిబ్బంది ప్రవర్తన, భక్తులకు అందించే సేవల పట్ల నిర్లక్ష్యం కనిపించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తనిఖీ సందర్భంగా సాధారణ భక్తుడిలా దర్శనానికి వెళ్లిన బీఆర్ నాయుడు, ఆలయ పరిసరాలు పరిశీలించగా పలు లోపాలు గమనించినట్లు తెలిసింది. దేవుడి అలంకరణ నుండి సిబ్బంది ప్రవర్తన వరకు నిర్లక్ష్యం కనిపించడం ఆయనను తీవ్రంగా ఆవేదనకు గురిచేసింది.
తరువాత బీఆర్ నాయుడు సోషల్ మీడియా వేదికగా కీలక ట్వీట్లో స్పందిస్తూ అన్నారు –
> “ఇవాళ ఆకస్మికంగా వెంకటపాలెం శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తనిఖీ చేశాను. సాధారణ భక్తుడిలా దర్శనానికి వెళ్లి ఆలయ నిర్వహణలో కొన్ని నిర్లక్ష్యాలు గమనించాను. దేవుడి అలంకరణ నుంచి సిబ్బంది తీరు వరకు నిర్లక్ష్యం కనిపించడం బాధాకరం. ఇలాంటి వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. భక్త సేవలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శ్రీవారి ఆలయాలను ఆకస్మికంగా సందర్శిస్తూ, భక్తులకు అందించే సేవా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తాం.”
టీటీడీ చైర్మన్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భక్తులు ఆయన చర్యను స్వాగతిస్తూ, “ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగించాలని” కోరుతున్నారు.