Nadendla manohar: ఈసారి ధాన్యం కొనుగోలు పండుగలా జరగాలి

Nadendla manohar: రాష్ట్రంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. విజయవాడలోని హోటల్ వివాంతలో జరిగిన రాష్ట్ర స్థాయి అధికారుల వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్‌, సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌ సంయుక్తంగా నిర్వహించాయి.

మంత్రి మాట్లాడుతూ, గత సంవత్సరం ఎదురైన సమస్యలను ఈసారి ముందస్తు ప్రణాళికలతో పరిష్కరించాలని ఆదేశించారు. గోనె సంచులు, రవాణా, లేబర్ సమస్యలు తలెత్తకుండా జాయింట్ కలెక్టర్లు ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. గోనె సంచుల సరఫరాలో దళారులను అరికట్టేందుకు పోలీసులతో కలిసి ప్రత్యేక విధానాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.

పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్‌పై రైస్ మిల్లర్లు ఇచ్చిన హామీలను కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. 60 రోజుల్లో ఎఫ్‌సీఐకి బియ్యం సరఫరా చేసే మిల్లులకు ప్రాధాన్యత ఇవ్వనన్నట్లు చెప్పారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పర్యవేక్షిస్తామని, ప్రతి అంశం డాష్‌బోర్డులో కనిపించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

గత ఏడాది అకాల వర్షాల కారణంగా పంపిణీ చేసిన 30,000 టార్పాల్స్‌ను గుర్తు చేస్తూ, ఈసారి కూడా అవసరాన్ని బట్టి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతులు వాట్సాప్‌లో “HI” అని పంపితే కొనుగోలు ప్రక్రియలో చేరే సౌకర్యం కల్పించామని, విక్రయించిన 24 నుంచి 48 గంటలలోపే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని తెలిపారు.

రైతులకు నచ్చిన మిల్లుకు ధాన్యం విక్రయించుకునే పూర్తి స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం కల్పించిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వాల లోపాలను సరిదిద్దుతూ రైతు స్నేహపూర్వక విధానాలతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల కమిషనర్ సౌరబ్ గౌర్, సివిల్ సప్లై కార్పొరేషన్‌ వీసీ & ఎండీ ఢిల్లీ రావు, వ్యవసాయ శాఖ ఎండి మంజీర్ జిలానీ, ఎఫ్‌సీఐ జీఎం విజయ్ కుమార్ యాదవ్, ఆర్టీజీఎస్ సీఈవో తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లై డీఎంలు, వ్యవసాయ శాఖ అధికారులు ఈ వర్క్‌షాప్‌లో హాజరయ్యారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *