Telangana Cabinet: తెలంగాణ మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వానకాలం సీజన్‌లో ధాన్యం దిగుబడుల కొనుగోళ్లు, ఇతర అంశాలంపై కీలక ఆదేశాలను జారీచేశారు. మంత్రివర్గ భేటీ అనంతరం రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించారు.
Telangana Cabinet: వానకాలంలో 1.48 కోట్ మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి అని, ఇందులో నుంచి 80 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రిమండలి నిర్ణయించిందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పకడ్బందీగా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.
Telangana Cabinet: వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాలు, రవాణా శాఖలు సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు. దాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌ను రైతులకు అందజేస్తామని వెల్లడించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించాలని ఆదేశించారు.
Telangana Cabinet: రాష్ట్రంలో కొత్తగా మూడు అగ్రికల్చర్ కళాశాలల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. హుజూర్‌నగర్, కొడంగల్, నిజామాబాద్‌లో ఆ అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు.
Telangana Cabinet: రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. ఇద్దరు పిల్లలకు మించి సంతానమున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హత నిబంధనను ఎత్తివేసేందుకు మంత్రివర్గం సూచనప్రాయంగా అంగీకరించినట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు.
Telangana Cabinet: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూరు మార్కెట్ యార్డుకు 10 ఎకరాలు కేటాయిసత్ఊ క్యాబినెట్ తీర్మానం చేసింది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి ఇప్పుడున్న చోటే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదే విధంగా వర్సిటీలో తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల శాతాన్ని 50 శాతానికి పెంచాలని తీర్మానం చేసింది.
Telangana Cabinet: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. మెట్రో 2ఏ, 2బీ విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది.
Telangana Cabinet: రాష్ట్రంలో హ్యామ్ పద్ధతిలో తొలి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్, ప్యారడైట్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాల కోసం ఇచ్చే రక్షణ శాఖ భూములకు ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది.
Telangana Cabinet: కృష్ణా-వికారబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి 845 హెక్టార్ల భూ సేకరణకు అయ్యే 438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు మంత్రివర్గం తీర్మానం చేసింది. మన్ననూర్-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ తీర్మానం చేసింది.