Hyderabad: నగర శివార్లలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధి, ధూలపల్లి పారిశ్రామికవాడలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ కవర్లను తయారు చేసే ఒక పాలిమర్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి, వేగంగా కంపెనీ మొత్తానికి వ్యాపించాయి. ప్లాస్టిక్ పాలిమర్లతో కూడిన పరిశ్రమ కావడం వల్ల మంటల తీవ్రత అతి వేగంగా పెరిగింది. దట్టమైన పొగ, ఎగిసిపడుతున్న మంటలు ఆ ప్రాంతమంతా కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళన చెందారు. చాలా దూరం నుంచి కూడా మంటలు కనిపించాయి.
Also Read: Konda Surekha: నన్ను ఇబ్బంది పెడుతున్నారు.. కొండా సురేఖ
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది చురుగ్గా స్పందించారు. రెండు ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది, మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్లాస్టిక్ కారణంగా మంటల తీవ్రత అధికంగా ఉండటంతో, అవి పక్కనున్న ఇతర పరిశ్రమలకు వ్యాపించకుండా నిరోధించడానికి వారు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో పరిశ్రమకు భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా వెల్లడించారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
ఈ అగ్నిప్రమాదంపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి, ఎంతమేర ఆస్తినష్టం జరిగిందో అంచనా వేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.