HCA

HCA సెలక్షన్‌ కమిటీ సభ్యులపై కేసు నమోదు

HCA: దేశంలోని అన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లు తమ తమ ప్రాంతీయ లీగ్‌ల ద్వారా కొత్త ప్రతిభావంతుల్ని వెలికితీస్తున్నాయి. కానీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రం దానికి విరుద్ధంగా ప్రతిసారీ వివాదాలకే వేదిక అవుతోంది. ఇప్పటికే ఎన్నో ఆరోపణలతో పరువు పోగొట్టుకున్న హెచ్‌సీఏ ఇప్పుడు మరోసారి తప్పుడు పత్రాలు, అవకతవకల ఆరోపణలతో చర్చనీయాంశమైంది.

ఫేక్ సర్టిఫికేట్లతో ఆటల్లో పాల్గొనడం

అనంత్ రెడ్డి అనే వ్యక్తి రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్ మ్యాచ్‌లలో నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలతో ప్లేయర్లు ఆడుతున్నారని ఆరోపించారు. హెచ్‌సీఏ నిర్లక్ష్యంతో ఎక్కువ వయసు ఉన్న క్రికెటర్లు తక్కువ వయసు కేటగిరీల్లో ఆడే అవకాశం పొందుతున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై గతంలో బీసీసీఐ ఆరుగురు ప్లేయర్లపై నిషేధం విధించినట్లు గుర్తు చేశారు. “టాలెంట్ ఉన్న నిజమైన ప్లేయర్లకు నష్టం కలిగేలా హెచ్‌సీఏ వ్యవహరిస్తోంది” అని అనంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెలెక్షన్‌లో అవకతవకలు

ఇటీవల ప్రకటించిన అండర్-19 వినూ మాంకడ్ ట్రోఫీ జట్టు ఎంపికలో కూడా తప్పుడు పత్రాలు, స్థానికేతర ఆటగాళ్ల ఎంపిక జరగడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కొంతమంది హెచ్‌సీఏ సెలెక్టర్లు తమ సొంత అకాడమీల్లో శిక్షణ పొందిన ప్లేయర్లను ఎంపిక చేస్తూ, ఇతర ప్రతిభావంతుల్ని పక్కనబెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: Mohammed Shami: ఫిట్‌నెస్‌పై షమీ ఫైర్.. సెలక్టర్లను నిలదీసిన టీమ్ ఇండియా పేసర్

పోలీసుల వద్దకు చేరిన ఫిర్యాదులు

ఇటీవలి రోజుల్లో కె. అనంతారెడ్డి, రామారావు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దానికి ముందు రాష్ట్ర గనుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఎ. అనిల్‌కుమార్ కూడా రాచకొండ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీరి ఆరోపణల ప్రకారం, సుమారు 38 మంది క్రికెటర్లు తప్పుడు పత్రాలతో లీగ్‌ల్లో ఆడుతున్నారని, వారికి సహకరిస్తున్న హెచ్‌సీఏ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

అర్హత లేని సెలెక్టర్లు?

హెచ్‌సీఏ నిబంధనల ప్రకారం జూనియర్ సెలెక్షన్ కమిటీలో ఉండాలంటే కనీసం 25 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి, ఐదు సంవత్సరాల కిందట రిటైర్ అయి ఉండాలి. కానీ, ప్రస్తుత కమిటీ సభ్యుల్లో కొందరు ఆ ప్రమాణాలకు చేరుకోలేదని విమర్శలు చెలరేగుతున్నాయి.
చైర్మన్ హబీబ్ అహ్మద్ 16 మ్యాచ్‌లు, అన్వర్ ఖాన్ 19 మ్యాచ్‌లు, సందీప్ రాజన్ మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడినవారేనని, అయినా వారిని సెలెక్టర్లుగా నియమించడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాక, మరో సెలెక్టర్ సుదీప్ త్యాగి తన అకాడమీకి చెందిన ప్లేయర్లకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపించారు.

హెచ్‌సీఏ నిశ్చల వైఖరిపై విమర్శలు

ఈ అంతా జరుగుతుంటే హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, జాయింట్ సెక్రటరీ బసవరాజు మాత్రం నిశ్శబ్దంగా వ్యవహరిస్తున్నారని సభ్యులు మండిపడుతున్నారు. గతంలో కూడా వివాదాల మయం అయిన హెచ్‌సీఏ, ఈసారి కూడా పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోకపోతే మరోసారి పరువు పోగొట్టుకునే అవకాశముందని క్రికెట్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *