Medak: సెల్యూట్ పోలీసన్న! మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మెదక్ పోలీస్

Medak: మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం నిస్సాంపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన మానవత్వాన్ని గుర్తు చేసేలా మారింది. జ్యోతి అనే మహిళ వ్యక్తిగత కారణాలతో తీవ్ర మనస్థాపానికి గురై, ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె ఈ చర్యను గమనించిన కుటుంబ సభ్యులు తక్షణం డయల్‌ 100కు ఫోన్ చేసి సహాయం కోరారు.

సందేశం అందుకున్న వెంటనే పోలీసు బృందం కేవలం 7 నిమిషాల్లోనే ఘటనాస్థలానికి చేరుకుంది. పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, వారు ఆలస్యం చేయకుండా తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అప్పటికే జ్యోతి అపస్మారక స్థితిలో ఉండగా, పోలీసులు వెంటనే ఆమెను కిందకు దించి సీపీఆర్‌ (Cardio Pulmonary Resuscitation) ప్రారంభించారు.

వారి సమయస్ఫూర్తి, ప్రావీణ్యం కారణంగా జ్యోతికి మళ్లీ శ్వాస మొదలైందీ, వెంటనే ఆమెను మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించి ఆమె ప్రాణాలను కాపాడగలిగారు.

ఈ సంఘటనతో స్థానిక ప్రజలు, గ్రామస్థులు, సామాజిక మాధ్యమాల్లోని నెటిజన్లు పోలీసుల వేగం, కర్తవ్యనిష్ఠ, మానవతా దృక్పథంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

“సమయానికి స్పందిస్తే ఎన్ని ప్రాణాలు కాపాడవచ్చో ఈ ఘటన మరోసారి నిరూపించింది” అని చాలా మంది అభిప్రాయపడ్డారు.

జ్యోతిని కాపాడిన ఆ పోలీసు సిబ్బంది నిజంగా ప్రజా రక్షకులని, వారి సేవలు గుర్తించి ‘సెల్యూట్ పోలీసన్న!’ అని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *