IND vs WI: వెస్టిండీస్‌తో ఇక్కడ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (175), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (129 నాటౌట్) మెరుపు సెంచరీలతో చెలరేగారు. వీరి అద్భుత ప్రదర్శనతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను భారీ 518 పరుగుల వద్ద 5 వికెట్ల నష్టానికి డిక్లేర్ చేసింది. రెండో రోజు ఆట రెండో సెషన్ లోపే ఈ భారీ స్కోరు సాధించింది.
గిల్ రికార్డు సెంచరీ
కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 177 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసి, తన కెరీర్‌లో ఇది 10వ సెంచరీగా నమోదు చేసుకున్నాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా, క్రీజ్‌లో కుదురుకున్నాక వేగం పెంచాడు. ఈ సెంచరీతో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డును గిల్ సమం చేయడం విశేషం. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్సీ తీసుకున్న గిల్ కి ఇది ఐదో సెంచరీ.
Also Read: Hardik Pandya: షాకిస్తున్న హార్దిక్ పాండ్యా న్యూ లవ్ స్టోరీ!
జైస్వాల్, గిల్ సెంచరీలతో పాటు, ఇతర బ్యాటర్లు కూడా తమ వంతు పాత్ర పోషించారు. నిన్న ఆట ముగిసే సమయానికి భారీ సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్, రెండో రోజు ఆట మొదలైన వెంటనే రనౌట్‌గా వెనుదిరగడం భారత్‌కు కాస్త గట్టి ఎదురుదెబ్బ. శుభ్‌మన్ గిల్‌తో సమన్వయ లోపం కారణంగా జైస్వాల్ పెవిలియన్‌కు చేరాడు. అయినప్పటికీ, సాయి సుదర్శన్ (87), నితీశ్‌కుమార్ రెడ్డి (43), కేఎల్ రాహుల్ (38) కూడా మంచి స్కోర్లు చేశారు.
ఆఖర్లో, కెప్టెన్ గిల్, ధ్రువ్ జురెల్ (44) తో కలిసి ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం నిర్మించాడు. దూకుడుగా ఆడిన జురెల్, అర్ధ సెంచరీకి 6 పరుగుల దూరంలో ఔట్ కాగానే, కెప్టెన్ గిల్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ 3 వికెట్లు తీయగా, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ సాధించాడు. ఓవర్‌నైట్ స్కోరు 318/2 తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్, మరో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పైగా జోడించి ఇన్నింగ్స్‌ను ముగించింది.