Gaza Cease Fire: ఇజ్రాయెల్ , హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత వేలాది మంది పాలస్తీనియన్లు గాజాకు తిరిగి వస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన తర్వాత ప్రజలు ఉత్తర గాజావైపు రావడం మెుదలుపెట్టారు. రెండేళ్లుగా ఇజ్రాయెల్ దాడుల కారణంగా దక్షిణ గాజాకు వెళ్లి గుడారాల్లో తలదాచుకున్న పాలస్తీనియన్లు.. ఉత్తర గాజాకు తరలిరావడం ప్రారంభించారు. అటు గాజాకు మానవతా సాయం రేపు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రోజుకు 600 ట్రక్కుల సాయానికి ఇజ్రాయెల్ అనుమతించినట్లు సమాచారం. దాదాపు లక్షా 70 వేల టన్నుల సాయం గాజాలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని ఐరాస అధికారి తెలిపారు.మరోవైపు హమాస్ చెరలోని 48 మంది బందీల విడుదల జరగనుంది.ఇందులో 20 మంది సజీవంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రతిగా వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 2 వేల మందికిపైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పుస్తకాలు చదవడం వల్ల మానసిక పరిపక్వత పెరుగుతుంది
తొలుత…తాము విడుదల చేయనున్న 250 మంది పాలస్తీనా ఖైదీల జాబితాను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. ఈ జాబితాలో తమ కీలక నేత మార్వాన్ బర్కూటీ పేరు చేర్చాలన్న హమాస్ డిమాండ్ ను.. ఇజ్రాయెల్ తిరస్కరించింది. అటు ఆయుధాలను తజ్యించడంపై హమాస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కాల్పుల విరమణ ప్రారంభమైనా యుద్ధం ముగింపుపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.