Fire Accident

Fire Accident: ఎరుపెక్కిన అమెరికా ఆకాశం.. లాస్‌ ఏంజిలస్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident: అమెరికాలోని కాలిఫోర్నియాలో గురువారం రాత్రి పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లాస్‌ ఏంజిలస్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి దక్షిణంగా ఉన్న ఎల్‌ సెగుండో ప్రాంతంలో గల చెవ్రాన్‌ చమురు శుద్ధి కర్మాగారం (Chevron Oil Refinery)లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ ధాటికి కర్మాగారం మొత్తం మంటల్లో చిక్కుకుంది.

ఆకాశమంతా అగ్నిగోళం

పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించి ఆకాశమంతా అగ్నిగోళాన్ని తలపించాయి. క్షణాల్లోనే మంటలు ఎగసిపడుతూ స్థానికులను భయాందోళనలకు గురి చేశాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

ప్రజలకు హెచ్చరికలు

అప్రమత్తమైన అధికారులు స్థానిక ప్రజలకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పెద్ద శబ్దాలతో మంటలు ఎగసిపడుతున్న వీడియోలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Karur Stampede: విజయ్‌ పర్యటన వాయిదా.. టీవీకే పార్టీ నేతకు బెయిల్‌ నిరాకరించిన మద్రాస్‌ హైకోర్టు

అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేదు

ఆందోళనకర విషయమే అయినప్పటికీ, అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

రెండో అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీ

చెవ్రాన్‌ శుద్ధి కర్మాగారం కాలిఫోర్నియాలో రెండో అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీగా గుర్తింపు పొందింది. రోజుకు సుమారు 2.76 లక్షల బ్యారెల్ల ముడి చమురును ప్రాసెస్‌ చేసే ఈ రిఫైనరీ నుంచి గ్యాసోలిన్‌, జెట్‌ ఇంధనం, డీజిల్‌ తదితర ఉత్పత్తులు తయారవుతాయి. దాదాపు 1.5 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కర్మాగారం, కాలిఫోర్నియా ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఇంధన సరఫరాపై ప్రభావం?

ఈ ఘటనతో ఇంధన ఉత్పత్తి, సరఫరాపై ఏ మేరకు ప్రభావం చూపుతుందనే విషయంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం, తాత్కాలికంగా సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *