Janagama Congress: జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, జనగామ… మూడు నియోజకవర్గాలున్నాయి. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో కేవలం పాలకుర్తిలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. పాలకుర్తి ఎమ్మెల్యేగా మామిడాల యశస్విని రెడ్డి విజయం సాధించారు. జనగామలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి విజయం సాధించారు. కడియం శ్రీహరి ఇటీవల బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలుంటే, బీఆర్ఎస్ గెలిచింది రెండు స్థానాలు మాత్రమే. ఆ రెండు కూడా జనగామ జిల్లా పరిధిలోనివి కావడం విశేషం. అలాంటి జనగామ జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అన్ని రకాలుగా సమర్థులు ఉండాల్సిన అవసరం ఉందని చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దరిమిలా, చురుకుగా పార్టీ కార్యక్రమాలు చేయడంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి విఫలమవుతున్నాడనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో నెలకొంది. జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంలోనే కాదు.. ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం, పరిష్కరించడంలోనూ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అలసత్వం వహిస్తున్నారన్న అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది పార్టీ క్యాడర్.
Also Read: Trump Tariffs: విదేశీ సినిమాలపై 100శాతం సుంకాలు
బీఆర్ఎస్ నుండి గెలిచి వివిధ కారణాల రీత్యా కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని గులాబీ నాయకులు విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతల విమర్శలను కడియం శ్రీహరి తనకు తానుగా ఖండించుకోవాల్సి వస్తోంది. జిల్లా అధ్యక్షునిగా ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కనీసం ప్రెస్ మీట్ పెట్టి కడియం శ్రీహరికి మద్దతుగా ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అలాగే, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల మీద… మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిత్యం ఏదో రకంగా బురద చల్లుతూనే ఉన్నారు. దయాకర్ రావు చేస్తున్న అసత్య ప్రచారాన్ని హనుమాండ్ల అత్తాకొడల్లు ధీటుగా ఎదుర్కొంటునే ఉన్నారు. కానీ, జిల్లా అధ్యక్షునిగా ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాత్రం ఏనాడూ స్పందించలేదనే భావన అంతటా నెలకొంది. ఇలా అన్ని రకాలుగా విఫలమవుతున్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని తప్పించి, ఈసారి అన్ని రకాలుగా సమర్థులైన నాయకులను గుర్తించి అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.
అనేక ఏళ్లుగా ఎమ్మెల్యే లేక అనాథలా మారిన పాలకుర్తి నియోజకవర్గానికి ఎడారిలో చుక్కానిలా మామిడాల ఝాన్సీ రెడ్డి లభించారు. సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మీద కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఝాన్సీ రెడ్డి సిద్ధం అయ్యారు. పౌరసత్వం ఆమెకు అడ్డురావడంతో తన కోడలు మామిడాల యశస్విని రెడ్డిని పోటీలో పెట్టి గెలిపించారు. తర్వాత పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో జనగామ జిల్లా అధ్యక్ష బాధ్యతలను ఝాన్సీ రెడ్డికి ఇస్తే బాగుంటుందనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బలమైన నేతగా ఉండి, కాంగ్రెస్ క్యాడర్‌ను చెల్లాచెదురు చేస్తున్నాడని, దీనితో చాలా మంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, ఈ వలసలను వెంటనే నిలిపివేయాలంటే ఝాన్సీ రెడ్డి లాంటి బలమైన నాయకురాలి అవసరం ఉందని అంటున్నారు. అంగబలం, ఆర్థిక బలం పుష్కలంగా కలిగిన ఝాన్సీ రెడ్డిని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.