Swami Chaitanyananda

Swami Chaitanyananda: స్వామి చైతన్యానంద సరస్వతి అరెస్ట్‌..!

Swami Chaitanyananda: ఆశ్రమం లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథిను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్రాలోని ఒక హోటల్‌లో దాక్కున్న ఆయనను ఆదివారం (సెప్టెంబర్ 28) తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు.

17 మంది విద్యార్థినులపై వేధింపుల ఆరోపణలు

దిల్లీకి నైరుతిలోని  శ్రీ శారదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ (SRISIIM) లో చదువుతున్న 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిపినట్లు ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. విద్యార్థినులను రాత్రివేళ తన గదికి పిలిపించడం, శారీరక సంబంధానికి బలవంతం చేయడం, విదేశీ పర్యటనలకు ఒత్తిడి చేయడం, బాలికల హాస్టల్ గదుల్లో సీసీటీవీలు అమర్చడం వంటి షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

అంతేకాకుండా, విద్యార్థినులు చేసిన ఫిర్యాదులో ఆయన అసభ్యకర సందేశాలు పంపినట్లు, భౌతికంగా తాకేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. డైరెక్టర్‌కు లొంగిపోవాలని మహిళా సిబ్బందే ఒత్తిడి చేసినట్లు విద్యార్థినులు ఆరోపించారు.

ఇది కూడా చదవండి: TVK Vijay Rally Stampede: 40 మంది మృతి.. విజయ్ ని అరెస్ట్ చేస్తారా..?

ముందస్తు బెయిల్ తిరస్కరణ

అరెస్టు కాకముందు చైతన్యానంద కోర్టులో ముందస్తు బెయిల్ కోరారు. కానీ ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. విచారణ సందర్భంగా ఆయన ఐక్యరాజ్యసమితి ప్రతినిధినని చెప్పుకోవడం మరింత వివాదాస్పదమైంది.

ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు

పోలీసుల దర్యాప్తులో ఆయనకు చెందిన 18 బ్యాంక్ ఖాతాలు, 28 ఫిక్స్‌డ్ డిపాజిట్లు బహిర్గతమయ్యాయి. మొత్తం రూ. 8 కోట్లు పైచిలుకు సొమ్ము ఆయన సృష్టించిన ట్రస్ట్ ద్వారా ముడిపడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని స్తంభింపజేశారు.

ఇది కూడా చదవండి: Karur Stampede: కరూర్‌ ఘటనతో నా హృదయం ముక్కలైంది.. విజయ్‌

ఎలా పట్టుబడ్డాడు?

ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే ఆయన పరారీలో ఉన్నారు. ఆఖరికి ఆగ్రాలోని ఒక హోటల్‌లో ఆయన తలదాచుకోవడం తెలిసి, పోలీసులు ఆపరేషన్ నిర్వహించి అరెస్టు చేశారు.

ఆరోపణల తీవ్రత

మార్చి 2025లో ఒక విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రారంభమైన దర్యాప్తులో, ఇప్పటివరకు 32 మంది విద్యార్థినులను విచారించగా, వారిలో 17 మంది నేరుగా చైతన్యానందపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. లైంగిక వేధింపులు, నకిలీ లైసెన్స్ ప్లేట్ వాడకం, మతాన్ని ముసుగుగా పెట్టుకుని మోసం వంటి కేసులు ఆయనపై నమోదయ్యాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *