CM Chandrababu: ప్రజా ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే మూడు ప్రధాన హామీలతో ఎన్నికలకు వెళ్లిన తమ ప్రభుత్వం, ‘సూపర్ సిక్స్’ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ‘సూపర్ హిట్’ సాధిస్తోందని ఆయన అసెంబ్లీలో వెల్లడించారు.
ఆటో డ్రైవర్లకు అక్టోబర్ 4న ‘వాహనమిత్ర’ సాయం:
రాష్ట్రంలోని 2.9 లక్షల మందికిపైగా అర్హులైన ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ 4న సాయంత్రం 4 గంటలకు ‘వాహనమిత్ర’ పథకం ద్వారా ప్రతి డ్రైవర్‌కు ఏటా రూ. 15 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. పెండింగ్‌లో ఉన్న చలాన్లను క్లియర్ చేసుకున్న వారికి కూడా ఈ సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు.
రికార్డు స్థాయిలో వృద్ధాప్య పింఛన్లు:
ప్రస్తుతం 63.5 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, పింఛను లబ్ధిదారుల్లో ఏకంగా 59% మంది మహిళలే ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. పేదరికమే ప్రామాణికంగా ప్రతి నెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని, వివిధ వర్గాలకు ఎక్కువ పింఛన్లు ఇచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ఆయన పేర్కొన్నారు.
మహిళా సంక్షేమానికి రెండు కీలక పథకాలు:
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు అండగా నిలిచామని చంద్రబాబు అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణంతో ఆక్యుపెన్సీ రేషియో 69 శాతం నుంచి 90 శాతానికి పెరిగిందని, మహిళలు రాష్ట్రమంతా ఉచితంగా తిరిగే అవకాశం లభించిందని తెలిపారు.
మరోవైపు, తన తల్లి వంటగదిలో పడిన బాధలను దృష్టిలో ఉంచుకుని తెచ్చిన ‘దీపం’ పథకాన్ని ఇప్పుడు ‘దీపం-2’ కింద కొనసాగిస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నామని, ఇప్పటికే ఈ పథకం కింద రూ. 1,700 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. తల్లిదండ్రులకు అండగా నిలిచేందుకు ‘తల్లికి వందనం’ సాయం ఇస్తున్నామని, ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ సాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
Also Read: RBI: ఆర్‌బీఐ కీలక నిర్ణయం: మరణించిన వారి ఖాతాలు ఇకపై 15 రోజుల్లో పరిష్కారం!
రైతుకు అండగా ‘అన్నదాత సుఖీభవ’ :
రైతులకు అండగా ఉండేందుకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం తెచ్చామని, రాష్ట్రం తరపున మూడు విడతల్లో రైతుకు ఏటా రూ. 14 వేలు ఇస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడంతో పాటు, అనేక పంటలకు మద్దతు ధర అందిస్తున్నామని, ఆక్వా రైతులకు రూ. 990 కోట్లు రాయితీ ఇచ్చామని పేర్కొన్నారు.
ఉద్యోగాలు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4.7 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, చిన్న తప్పు కూడా జరగకుండా మెగా డీఎస్సీ నిర్వహించామని ముఖ్యమంత్రి తెలిపారు. గత పాలనలో రద్దు చేసిన అన్న క్యాంటీన్లను మళ్లీ 204 చోట్ల ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఈ సంఖ్యను 271కి పెంచుతామని హామీ ఇచ్చారు. పేదలకు అన్నం పెట్టే ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
విశాఖ విజన్, ఇతర హామీలు:
విశాఖపట్నం ఫైనాన్షియల్ హబ్‌గా, టెక్నాలజీ హబ్‌గా మారనుందని, పెద్ద కంపెనీలకు రూపాయికి ఎకరం ఇవ్వడం ‘గేమ్ ఛేంజర్’ అవుతుందని చంద్రబాబు అభివర్ణించారు. దీపావళి కానుకగా 3 లక్షల ఇళ్లు పూర్తి చేసి ఇస్తామని, 2029లోగా అందరికీ సొంతిల్లు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే, బీసీ వర్గాల జోలికొస్తే సహించేది లేదని, ఖబడ్దార్ అంటూ ముఖ్యమంత్రి హెచ్చరిక జారీ చేశారు.