Andhra University: ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో బీఈడీ విద్యార్థి మణికంఠ మృతిపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం వల్లే మణికంఠ చనిపోయాడని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు రెండో రోజు కూడా నిరసనను కొనసాగించాయి.
విజయనగరం జిల్లాకు చెందిన వింజమూరి వెంకట సాయి మణికంఠ (25) అనే బీఈడీ రెండో సంవత్సరం విద్యార్థి యూనివర్సిటీలోని హాస్టల్‌లో ఉంటున్నాడు. గురువారం ఉదయం వాష్‌రూమ్‌లో కాలు జారి కింద పడ్డాడు. అతనికి ఊపిరి అందడం లేదని గుర్తించిన తోటి విద్యార్థులు వెంటనే యూనివర్సిటీలోని డిస్పెన్సరీ (చిన్న ఆస్పత్రి)కి ఫోన్ చేసి అంబులెన్స్‌ను రప్పించారు.
అంబులెన్స్‌లో ఆక్సిజన్ సౌకర్యం లేకపోవడంతో, ఊపిరి అందడం లేదని మణికంఠ కోరినా ఫలితం లేకుండా పోయింది. చివరకు విద్యార్థులు అతన్ని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)కి తరలించారు. కానీ, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. వెంటనే ఆక్సిజన్ అందించి ఉంటే అతని ప్రాణాలను కాపాడగలిగే వారని వైద్యులు చెప్పడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
Also Read: YVS Chowdary: దర్శకుడు వైవీఎస్ చౌదరి ఇంట విషాదం: తల్లి రత్నకుమారి కన్నుమూత
యూనివర్సిటీ క్యాంపస్‌లో సరైన వైద్య సిబ్బంది, ఆక్సిజన్ సౌకర్యం లేకపోవడంతోనే మణికంఠ మరణించాడని ఆరోపిస్తూ విద్యార్థులు నిరసనలకు దిగారు. యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు. పరీక్షలు, తరగతులు బహిష్కరించి క్యాంపస్‌లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. వైస్ ఛాన్సలర్ (వీసీ) రాజశేఖర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వీసీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. మాకు న్యాయం కావాలి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ ఆందోళనల కారణంగా ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.