Hyderabad: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఈ కార్యక్రమం శుక్రవారం జరగాల్సి ఉండగా, వర్షాలు తగ్గకపోవడంతో వచ్చే ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) ప్రకటించింది.
ఒకప్పుడు ఆనవాళ్లు లేకుండా పోయిన ఈ చారిత్రక బతుకమ్మ కుంటకు హైడ్రా పుణ్యమా అని పూర్వవైభవం వచ్చింది. 1962-63 లెక్కల ప్రకారం దాదాపు 14 ఎకరాల 6 గుంటలు ఉన్న ఈ కుంట, నగర విస్తరణతో కబ్జాదారుల పాలైంది. నిర్మాణ వ్యర్థాలు, చెత్తాచెదారంతో కూరుకుపోయి, చివరికి ఐదు ఎకరాల 15 గుంటల స్థలం మాత్రమే మిగిలింది.
Also Read: Vontimitta: ఒంటిమిట్టకు దక్కనన్న మరో ఖ్యాతి
హైడ్రా రంగంలోకి దిగి, కబ్జా అయిన స్థలాన్ని స్వాధీనం చేసుకుని, రూ.7.40 కోట్లు ఖర్చు చేసి దీనిని సుందరీకరించింది. కుంటను తవ్వి, చుట్టూ మెట్లతో కాంక్రీట్ గోడ నిర్మించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కుంట నిండుకుండలా మారింది. కుంట చుట్టూ వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆట స్థలం ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఈ ప్రాంతం సిటీ వాసుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ అభివృద్ధి నేపథ్యంలోనే, రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఉత్సవాల వేళ, నూతన శోభతో వెలుగొందుతున్న బతుకమ్మ కుంటను ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. తక్కువ సమయంలోనే ఈ ప్రాంతం రూపురేఖలు మార్చిన హైడ్రా కృషిని నగర ప్రజలు అభినందిస్తున్నారు.