Kavita: పాత ఉద్యమకారులంతా ఒక్కటైతే మన పవర్‌ను తెలంగాణ సమాజం గుర్తిస్తుందని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు పాండురంగా రెడ్డి, బీఎస్పీ మల్కాజిగిరి ఇన్చార్జి అందుగుల సత్యనారాయణ సహా పలువురు ఉద్యమకారులు జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా కవిత వారిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కవిత మాట్లాడుతూ –
“ఆనాడు అందరం ఉద్యమంలో కలిసి పని చేశాం. రాష్ట్రాన్ని సాధించిన విన్నింగ్ టీమ్ మనమే. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం సామాజిక తెలంగాణను సాధించుకోవడమే” అని స్పష్టం చేశారు.
తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, యువత, ఆడబిడ్డలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నామని తెలిపారు.
ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి సాధించాలనే దిశగా కొత్త లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
పాండురంగా రెడ్డి వంటి నేతలు జాగృతిలో చేరడం ఆనందకరమని, ఆయన డెడికేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినదని కవిత పేర్కొన్నారు. ఇలాంటి శక్తులు ఒక్కో జిల్లాలో జాగృతితో కలవడం సంతోషకరమని, వారందరికీ “ఓపెన్ హార్ట్‌తో వెల్కమ్” చెబుతున్నామని తెలిపారు.
అలాగే ఉద్యమకారులు “ఉద్యమకారుల ఫోరమ్” పేరుతో పని చేసేందుకు ముందుకు వస్తున్నారని, కళాకారులు కూడా తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. పేదల పక్షాన నిలవడమే జాగృతి ప్రధాన లక్ష్యమని, కుత్బుల్లాపూర్‌లో హైడ్రా నిరుపేదల ఇళ్లు కూల్చినప్పుడు మొదట మద్దతుగా నిలిచింది జాగృతేనని గుర్తు చేశారు.జాగృతిలో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని కవత హామీ ఇచ్చారు.