ICC: అమెరికా క్రికెట్‌కు గట్టి దెబ్బ తగిలింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) యూఎస్ఏ క్రికెట్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
ఐసీసీ స్పష్టంచేస్తూ— “సభ్యత్వ హోదా ఉన్న బోర్డు తన బాధ్యతలను పదేపదే విఫలపరిచింది. పాలనాపరమైన లోపాలు, ఒలింపిక్ గుర్తింపు సాధించడంలో విఫలం, క్రికెట్ ప్రతిష్టను దెబ్బతీసే చర్యలు… ఇవన్నీ కలిపి ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పరిచాయి” అని తెలిపింది.
2028 ఒలింపిక్స్ నేపథ్యం
2028 లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ తిరిగి ప్రవేశిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో అమెరికా జట్టును పూర్తిగా దూరం చేయకూడదని ఐసీసీ భావించింది. అందుకే సభ్యత్వాన్ని నిలిపివేసినా, ఒలింపిక్స్ సహా ఐసీసీ ఈవెంట్లలో అమెరికా జట్లకు పోటీ చేసే అనుమతి ఇస్తోంది. అయితే, ఇకపై అమెరికా జట్ల పరిపాలనను తాత్కాలికంగా ఐసీసీ లేదా దాని ప్రతినిధులు నేరుగా పర్యవేక్షించనున్నారు.
ఆటగాళ్లకు నమ్మకం కలిగించేందుకు చర్యలు
ఈ సస్పెన్షన్ కారణంగా ఆటగాళ్లు నష్టపోకుండా ఉండేలా ఐసీసీ హామీ ఇస్తోంది. “క్రీడ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు కాపాడటం మా లక్ష్యం. ఆటగాళ్ల అభివృద్ధి, హై-పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్‌లను కొనసాగించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టబడుతుంది” అని గ్లోబల్ బాడీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Hyderabad: హైకోర్టుకు స్మిత సబర్వాల్ ఏ కేసు తెలుసా?
సస్పెన్షన్ ఎత్తివేయాలంటే..?
ఈ సస్పెన్షన్ శాశ్వతం కాదని ఐసీసీ స్పష్టం చేసింది. సాధారణీకరణ కమిటీ (Normalization Committee) యూఎస్ఏ క్రికెట్‌పై నిఘా ఉంచనుంది. పాలన నిర్మాణం, కార్యకలాపాలు, క్రికెట్ వాతావరణంలో స్పష్టమైన మార్పులు తీసుకురావాలని, అప్పుడే సభ్యత్వం పునరుద్ధరిస్తామని తెలిపింది.
నేపథ్యం
2024లో అమెరికా భాగస్వామ్య ఆతిథ్యంతో T20 ప్రపంచకప్ జరిగినా, అప్పటికే ఐసీసీ అమెరికా బోర్డుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసింది. 12 నెలల సమయం ఇచ్చినా లోపాలను సరిచేయడంలో విఫలమయ్యిందని ఇప్పుడు ప్రకటించింది.