BRS:

BRS: క‌విత లోటును పూడ్చే ప‌నిలో బీఆర్ఎస్‌.. క‌విత స్థానం ఆమెకేనా?

BRS:బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఆ పార్టీలో ఉన్న‌ప్పుడు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. తెలంగాణ ఉద్య‌మ కాలం నుంచే తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా బ‌తుక‌మ్మ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తూ, బీఆర్ఎస్‌కు ఎంతో కొంత పాపులారిటీని సంపాదించి పెట్టారు. అదే విధంగా సింగ‌రేణి సంస్థ కార్మిక యూనియ‌న్ నాయ‌కురాలిగా కూడా ఆమె బీఆర్ఎస్‌కు చేదోడు వాదోడుగా నిలిచారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా, బీఆర్ఎస్ నాయ‌కురాలిగా పార్టీ చేప‌ట్టిన ఉద్య‌మాల్లో కూడా క్రియాశీల‌కంగా పాల్గొన్నారు. ఇటీవ‌లే బీఆర్ఎస్ నుంచి ఆమె స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఆమె లేనిలోటును భ‌ర్తీచేసే ప‌నిలో ఆ పార్టీ క‌స‌ర‌త్తు చేస్తున్న‌ది.

BRS:బీఆర్ఎస్ పార్టీ నుంచి క‌విత‌ బయటకు వెళ్లిపోవడంతో.. ఆమెకు ప్రత్యామ్నాయ మహిళా నేత కోసం ఆ పార్టీ అధినాయకత్వం ప‌రిశీల‌న‌లో ప‌డింది. పార్టీలో కవిత స్థానాన్ని భర్తీ చేసేలా మరో నాయకురాలిని తీర్చిదిద్దాలని భావిస్తున్న‌ది. ఇందుకోసం పార్టీ ఆవిర్భావం నుంచి బీఆర్ఎస్ తోనే ఉంటూ వస్తున్న సీనియర్ నాయకురాలు, మెద‌క్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిని ఎంచుకున్నట్టు స‌మాచారం. అందులో భాగంగానే ఈసారి పార్టీ తరఫున నిర్వహించే బతుకమ్మ పండుగ బాధ్యతను కూడా ఆమెకే ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.

BRS:తెలంగాణ జాగృతి పేరిట కల్వకుంట్ల కవిత ప్రతి ఏటా బతుకమ్మ పండుగను నిర్వహించేవారు. బతుకమ్మ పండుగకు కొత్త ఇమేజ్ ఇవ్వడంలో కవిత కీలక పాత్ర పోషించారు. బతుకమ్మ పండుగకు కవిత పర్యాయపదంగా మారార‌న‌డంలో అతిశ‌యోక్తి కూడా లేదు. రెండు దశాబ్దాలుగా ఈ ప్ర‌క్రియ‌ కొనసాగింది. ఇప్పుడు కవితను బీఆర్ఎస్ నుంచి స‌స్పెండ్ చేశారు. తన సంస్థ ‘తెలంగాణ జాగృతి’ ద్వారా బతుకమ్మ పండుగ నిర్వహించాలని ఆమె తాజ‌గా భావిస్తున్నారు.

BRS:ఈసారి నిర్వ‌హించే బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు తన వ్యక్తిగత ప్రచారం చేసుకునేందుకు కూడా క‌విత‌ దీనిని ఉపయోగించుకునే అవకాశం ఉన్న‌ది. ఈ నేపథ్యంలో రెండు దశాబ్దాల తరువాత తొలిసారిగా కవిత లేకుండా బీఆర్ఎస్ పార్టీ బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్న‌ది. దీంతో పార్టీలో ఎవరితో బతుకమ్మ పండగను నిర్వహించాలన్న అంశంపై ఇటీవ‌లే చర్చ జరిగింది. పలువురు మహిళా నేతల పేర్లను పరిశీలించిన అనంతరం పద్మా దేవేందర్ రెడ్డి పేరును అధినేత కేసీఆర్ నిర్ధారించిన‌ట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

BRS:బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న పద్మాదేవేందర్ రెడ్డికి ఆ పార్టీ అధినాయకత్వంతో మంచి సంబంధాలే ఉన్నాయి. కవిత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఆమెతోపాటు పద్మ బతుకమ్మ ఉత్సవాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ నిర్వహణకు కేసీఆర్ ఆమె పేరును ఎంపిక చేసినట్లు తెలుస్తున్న‌ది. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున బతుకమ్మ పండుగకు సంబంధించి వివిధ పనులను పద్మాదేవేందర్ రెడ్డి చూసుకుంటున్నారు. ఇటీవలే మూడు బతుకమ్మ పాటలను కూడా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కు చెందిన ఇతర మహిళా నేతలతో కలిసి పద్మాదేవేందర్ రెడ్డి విడుదల చేశారు.

BRS:బతుకమ్మ పండుగ నిర్వహణకు పద్మా దేవేందర్ రెడ్డిని బీఆర్ఎస్ ఎంపిక చేసినా.. ఈ నిర్ణయం భవిష్యత్తు రాజకీయాలకూ సంకేతమని అంటున్నారు. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పార్టీలో మహిళా నేతగా ఆమెదే కీలక పాత్ర ఉండేది. ఇప్పుడు కవిత స్థానంలో బతుకమ్మ పండుగనే కాకుండా రాజకీయంగానూ ఆ స్థానం పద్మా దేవేందర్ రెడ్డితో భర్తీ చేసే యోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు కవిత సొంత పార్టీ ఏర్పాటు దిశగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంపై కవిత ఎలా స్పందిస్తారన్నది మాత్రం ఇంకా తెలియడంలేదు. తన తండ్రి స్వగ్రామమైన చింతమడకలో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆమె సమాయత్తమవుతున్న‌ట్టు తెలుస్తున్న‌ది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *