H-1B Visa

H-1B Visa: H-1B వీసాపై ట్రంప్ కీలక నిర్ణయం.. రూ.లక్ష డాలర్లు కట్టాల్సిందే

H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై H-1B వీసాలకు సంవత్సరానికి $100,000 (సుమారు ₹83 లక్షలు) దరఖాస్తు రుసుము విధించాలని ఉత్తర్వులు పై ఆయన సంతకం చేశారు. ఈ చర్యతో అమెరికాలో ఉద్యోగాల కోసం వెళ్తున్న భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ప్రభావితమవుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ మాట్లాడుతూ, “ప్రతి కంపెనీ ఇకపై ఒక్కో H-1B వీసాకు సంవత్సరానికి లక్ష డాలర్లు చెల్లించాలి అన్నారు. ఇది అమెరికన్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు కల్పించడమే లక్ష్యం” అన్నారు. “ఉద్యోగాలను తీసుకోవడానికి బయట నుంచి వ్యక్తులను రప్పించడం ఆపాలి. మా విశ్వవిద్యాలయాల్లో గ్రాడ్యుయేట్ అయిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలి” అని స్పష్టం చేశారు.

టెక్ కంపెనీలపై భారం

ఈ కొత్త విధానంపై అమెజాన్, గూగుల్, ఆపిల్, మెటా వంటి అతిపెద్ద టెక్ కంపెనీల ప్రతినిధులు స్పందించకపోయినా, ట్రంప్ మాత్రం “టెక్ రంగం ఈ మార్పును సానుకూలంగానే చూస్తోంది” అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం H-1B లాటరీలో ప్రవేశించడానికి కేవలం సాధారణ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. కానీ ఇప్పుడు కొత్త రుసుము కారణంగా అన్ని కంపెనీల ఖర్చులు అమాంతం పెరిగే అవకాశం ఉంది.

H-1Bలో భారతీయుల ఆధిక్యం

అధికారిక గణాంకాల ప్రకారం, H-1B వీసాలు పొందుతున్న వారిలో భారతీయుల వాటా 71%, చైనా 11.7%గా ఉంది. ప్రతి సంవత్సరం అమెరికా లాటరీ విధానంలో 85,000 వీసాలను జారీ చేస్తుంది. ఈ ఏడాది అత్యధిక H-1B ఆమోదాలు అమెజాన్ (10,000కి పైగా)కి రావడం గమనార్హం. తరువాత టీసీఎస్, మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ICC Big Shock To Pakistan: పాకిస్థాన్‌కు బిగ్ షాక్… ఐసీసీ చర్యలు?

చట్టబద్ధతపై ప్రశ్నలు

అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ పాలసీ డైరెక్టర్ ఆరోన్ రీచ్లిన్-మెల్నిక్ ఈ కొత్త ఫీజుపై ప్రశ్నలు లేవనెత్తారు. “దరఖాస్తు ప్రాసెసింగ్ ఖర్చును వసూలు చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఫీజులు నిర్ణయించగలదు. కానీ ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో భారీ రుసుము విధించడం చట్టబద్ధమా అన్నది స్పష్టత కావాలి” అన్నారు.

ప్రభావం ఏమిటి?

🔹 కంపెనీలు భారీ రుసుము భరించలేక, వీసా దరఖాస్తులను తగ్గించే అవకాశం ఉంది.
🔹 దీనివల్ల భారతీయ ఐటీ నిపుణులకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది.
🔹 మరోవైపు అమెరికాలోని లోకల్ గ్రాడ్యుయేట్లకు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

ఈ నిర్ణయం టెక్ రంగం, ఇమ్మిగ్రేషన్ పాలసీలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే టాలెంట్‌పై ఇది నేరుగా ప్రభావం చూపనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *