Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy: కేటీఆర్‌కి పొంగలేటి సవాల్!

Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎప్పటికో మూడున్నర సంవత్సరాల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికలపై చర్చించటం కంటే, త్వరలోనే జరగబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిచే ధైర్యం కేటీఆర్‌కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. “బచ్చాగాడిని పెట్టి గెలిపిస్తా అంటున్నావ్ కదా, ముందుగా ఆ మాట నిలబెట్టుకో” అని పొంగులేటి ఎద్దేవా చేశారు.

ఖమ్మం రూరల్‌లో జరిగిన సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. “రాబోయే పాలేరు ఎన్నికల్లో నేను ఎలా గెలుస్తానో చూద్దాం అంటున్నారు. కానీ మీకే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత దుస్థితి వచ్చిందో ప్రజలు చూశారు. స్థానిక ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి తప్పదని మీకు తెలుసు” అని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగే బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ పొంగులేటి, “సీఎం రేవంత్ రెడ్డి రాత్రింబగళ్లు కష్టపడుతున్నారు. ప్రజల కోసం ఇళ్లు, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే మీకు కడుపుమంట ఎందుకు? డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రమే కాదు, ప్రతి పేదోడికి ఆశ్రయం కల్పించడమే మా లక్ష్యం. కానీ మీరు మాత్రం కమిషన్‌ల కోసం కాళేశ్వరం కట్టే పనిలో పడ్డారు. పాముకు కోరల్లోనే విషం ఉంటుంది, కానీ మీ పార్టీకి మాత్రం ఒళ్ళంతా విషమే” అని ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: Keanu Reeves: స్నాప్ మ్యాప్స్‌లో కియాను రీవ్స్: మూవీ ప్రమోషన్‌లో కొత్త సర్ప్రైజ్.!

ఇంకా ఘాటుగా విరుచుకుపడిన మంత్రి, “మీ కుటుంబ సమస్యలను రాష్ట్ర సమస్యలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీ సోదరి, మీ బిడ్డ సమస్యలను మా సీఎం మీదకు నెట్టకండి. మొన్న మీ ట్విట్టర్ టిల్లు ఏదో మాట్లాడుతున్నాడు. ముందుగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీ బలం నిరూపించుకోండి. మూడున్నర సంవత్సరాల తర్వాత నువ్వు ఇండియాలో ఉంటావా, లేక విదేశాల్లో ఉంటావా చూడాలి” అంటూ కేటీఆర్‌ను నేరుగా సవాలు చేశారు.

చివరగా పొంగులేటి, “కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు. పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎంత దుస్థితి వచ్చిందో మళ్లీ స్థానిక ఎన్నికల్లో కూడా అదే జరుగుతుంది. ప్రజల తీర్పు మీకు ఎప్పటికీ గుర్తుండేలా ఉంటుంది” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *