Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘమే ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో బందీగా మారి బీజేపీకి ఎన్నికల ఏజెంట్‌లా వ్యవహరిస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశ ప్రజలంతా పోరాడాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.
ఈసీతో పాటు సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ వంటి కేంద్ర సంస్థలన్నీ ప్రధాని నియంత్రణలో పనిచేస్తున్నాయని ఆరోపించారు. కర్ణాటకలోని మహాదేవపుర నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు నమోదు చేయడం, మహారాష్ట్ర ఎన్నికల్లో చివరి గంటలోనే 60 లక్షల ఓట్లు అనూహ్యంగా నమోదు కావడం వంటి ఉదాహరణలను ప్రస్తావిస్తూ ఎన్నికల అవకతవకలను బయటపెట్టారు.
ఎన్నికలకు కేవలం ఐదు నెలల ముందే కోటికి పైగా కొత్త ఓట్లు నమోదు కావడం వెనుక పెద్ద కుట్ర ఉందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఓట్ల దోపిడీపై పోరాటానికి సిద్ధమైందని, ఆ ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపడుతున్నట్లు ప్రకటించి ప్రజల మద్దతు కోరారు.