Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించాల్సిన ఆవశ్యకతపై ఆయన రైతులకు సూచనలు చేశారు. ఎక్కువ యూరియా వాడితే అధిక దిగుబడి వస్తుందనే భావన సరికాదని, దీనికి ఉదాహరణగా పంజాబ్‌ను తీసుకోవాలని అన్నారు. అవసరం మేరకు మాత్రమే యూరియా వాడాలని రైతులకు పిలుపునిచ్చారు.
యూరియా వాడకం తగ్గించిన రైతులకు ఆర్థిక సాయం
రైతులు యూరియా వాడకాన్ని తగ్గిస్తే, వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం వాడుతున్న యూరియాలో ప్రతి బస్తా తగ్గించినందుకు రూ. 800 చొప్పున నేరుగా రైతులకు అందజేస్తామన్నారు. ఈ నిర్ణయం రైతుల ఆదాయం పెంచడంతో పాటు, భూసారం కాపాడటానికి కూడా ఉపయోగపడుతుందని తెలిపారు. రసాయన ఎరువుల అతి వాడకం వల్ల మన మిరప ఉత్పత్తులను చైనా వెనక్కి పంపిందని, యూరప్ దేశాలు కూడా ధరలను తగ్గించాయని ఆయన గుర్తు చేశారు.
Also Read: Bandi Sanjay: పాలకులపై ప్రజలకు విశ్వాసం పోయింది: బండి సంజయ్
ప్రజారోగ్యం, వ్యవసాయంపై సీఎం దృష్టి
యూరియా వాడకం తగ్గించడం వల్ల ప్రజారోగ్యం కూడా మెరుగుపడుతుందని చంద్రబాబు అన్నారు. ఏపీ క్యాన్సర్ కేసుల్లో టాప్ 5 స్థానంలో ఉందని, ఇలాగే కొనసాగితే మొదటి స్థానానికి చేరుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే, యూరియా వాడకాన్ని తగ్గించడం చాలా ముఖ్యమని చెప్పారు. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రణామ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సబ్సిడీని నేరుగా రైతులకే ఇచ్చేద్దామని సూచించారు.
పశు సంపద అభివృద్ధికి ప్రాధాన్యత
పశు సంపద అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. అర్బన్ నియోజకవర్గాలు మినహా 157 నియోజకవర్గాల్లో యానిమల్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద వృద్ధి చెందుతుందని, జీఎస్డీపీ వృద్ధిలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పాడి పరిశ్రమ అనేది రైతులకు మంచి ఆదాయ మార్గంగా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.