Satyavati Rathod: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కష్టాలు అంతా ఇంతా కాదు. గ్రోమోర్ కేంద్రాలు, పీఏసీఎస్ సెంటర్లు, ఇతర కేంద్రాల్లో రైతుల వరుసలు నిత్యకృత్యమయ్యాయి. ఎందరో రైతులు స్పృహతప్పి పడిపోయి ఆసుపత్రుల పాలవుతుంటే, ఇంకెందరో రైతులకు ఫిట్స్ వచ్చి ప్రాణాల మీదికి వస్తున్నది. ఏకంగా నిన్న ఓ రైతు ప్రాణాన్నే బలి తీసుకున్నది. క్యూలో నిల్చుంటే నగదు పోయిందని, భార్యాభర్తలు గొడవపడగా, భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
Satyavati Rathod: ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నాయకురాలు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తన స్వగ్రామం పరిధిలో యూరియా కోసం లైన్‌లో నిల్చున్న ఘటన సంచలనంగా మారింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు రైతు వేదిక వద్ద ఆమె యూరియా బస్తాల కోసం ఇతర రైతులతోపాటు క్యూలో చాలాసేపు నిల్చున్నారు.
Satyavati Rathod: సత్యవతి రాథోడ్ సొంతగ్రామం పెద్ద తాండ. ఆమెకున్న ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమికి యూరియా కోసం ఆమె క్యూలో వేచి ఉండగా, కేవలం ఒక్క బస్తా మాత్రమే ఆమె ఇచ్చారు. దీంతో ఆమె అసహనం వ్యక్తంచేశారు. ఈ ఘటన రాష్ట్రంలో యూరియా కొరతకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నది. ఇలా రైతులు రోజూ లైన్‌లో రోజులకొద్దీ నిల్చున్నా కొందరికి అసలే దొరకక అసహనం వ్యక్తం చేస్తున్నారు.