Lokesh Meets Modi: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. గత నాలుగు నెలల్లో లోకేష్ మోడీతో భేటీ అవడం ఇది రెండో సారి. మే 17న కుటుంబ సమేతంగా మోడీని కలిసిన లోకేష్, అప్పుడు వ్యక్తిగత అంశాలపై మాత్రమే చర్చించారు. అయితే, రేపటి భేటీలో రాజకీయ, పరిపాలనా అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా, వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్‌పై సిట్ దర్యాప్తు కీలక దశలో ఉంది. తాజాగా మరో ఇద్దరు వైసీపీ నేతల పుత్ర రత్నాల పేర్లు లిక్కర్ ఫైల్స్ లో చేర్చింది సిట్. సజ్జల భార్గవరెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిల పాత్రని సిట్ గుర్తించింది. వీరితో పాటూ చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్‌గా ఎదిగి… వైసీపీ టికెట్‌పై చిత్తూరు నుండి పోటీ చేసిన విజయానందరెడ్డి ప్రమేయాన్ని కూడా సిట్ గుర్తించింది.
ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో అనుమానితుడిగా ఉన్న ప్రద్యుమ్నతో సహా.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, ఈ విజయానందరెడ్డిలకు సంబంధించిన సుమారు 16 షెల్ కంపెనీలను సిట్ తాజాగా గుర్తించింది. మద్యం కుంభకోణంలో దోచిన డబ్బు రూటింగ్ కోసం, బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకు, సినిమా, ఎలక్షన్, రియల్ఎస్టేట్లో పెట్టుబడులుగా మళ్లించేందుకు ఈ డొల్ల కంపెనీలను సృష్టించినట్లు సిట్ అనుమానిస్తోంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు, అంతిమ లబ్ధిదారుడు అయిన బిగ్ బాస్‌కి లిక్కర్ ముడుపుల ద్వారా 60 నుండి 70 కోట్లు ప్రతినెలా అందేవని ఇప్పటికే సిట్‌కు ఆధారాలు లభించాయి. ఇకనైనా అంతిమ లబ్ధిదారుడికి సిట్ నోటీసులు అందించేనా, విచారణకు పిలిచేనా అని అంతా చర్చించుకుంటున్న నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠని రేకెత్తిస్తోంది.
Also Read: Deputy CM Ajit Pawar: నీకెంత ధైర్యం..? మహిళా ఐపీఎస్ అధికారితో డిప్యూటీ సీఎం వాగ్వాదం
లోకేష్ ఈ భేటీలో లిక్కర్ స్కామ్ విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు మోడీ అనుమతి కోరవచ్చని అంచనా. అదే సమయంలో, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన కేసుల నుంచి రక్షణ కోసం బీజేపీతో, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌తోనూ సఖ్యతని నెరుపుతూ వ్యూహాత్మక గేమ్ ఆడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. లోకేష్ ఈ విషయాన్ని కూడా మోడీకి వివరించే అవకాశం ఉందంటున్నారు. ఈ పర్యటనలో లోకేష్ కొందరు కేంద్ర మంత్రులను కూడా కలవనున్నారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీస్తుందని పలువురు భావిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసు క్లైమాక్స్‌కు చేరుతున్న నేపథ్యంలో, జగన్‌కు నోటీసులు జారీ అయితే, అది ఈ సమావేశం ఫలితమేనని అనుకోవచ్చు. లోకేష్ ఈ భేటీతో రాజకీయంగా మరో మెట్టు ఎక్కుతున్నారని, టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి నిర్మాణాత్మక రాజకీయాలతో ముందుకు సాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

