Harish Rao: వరద నివారణ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. గురువారం (ఆగస్టు 28) ఆయన మెదక్ ఉమ్మడి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులకు బీఆర్ఎస్ తరఫున సహాయక చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Harish Rao: మెదక్ జిల్లా ముంపు ప్రాంతాలను పర్యటించిన అనంతరం హరీశ్‌రావు ప్రభుత్వం నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మెదక్, కామారెడ్డి వరద ప్రవాహంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మూసీ సుందరీకరణ, ఒలింపిక్ పోటీల అంశంపై సమీక్షలు చేస్తున్నారని విమర్శించారు. వరద సహాయక చర్యల కంటే ఆ రెండు అంశాలే ముఖ్యమంత్రికి ముఖ్యమైనవా? అని ప్రశ్నించారు.
Harish Rao: మెదక్ జిల్లా రాజాపేట వరదల్లో చిక్కుకున్న ఇద్దరు కరెంట్ స్తంభం ఎక్కి నాలుగు గంటలుగా సహాయం కోసం ఎదురు చూశారని,హెలికాప్టర్ పంపించి ఉంటే వాళ్లు ప్రాణాలతో దక్కేవారని హరీశ్‌రావు తెలిపారు. వారి మరణం బాధాకరమని తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. అత్యవసరమైతే తప్ప హెలికాప్టర్ వాడలేమని ఓ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
Harish Rao: పెద్ద ఎత్తున పంటపొలాలు వరదలో మునిగిపోయాయని, రైతులకు తీరని నష్టం మిగిలిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత రైతులకు ఎకరాకు రూ.25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని తెలిపారు. ఇప్పటికీ సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం మేల్కొనలేదని ధ్వజమెత్తారు.
Harish Rao: మెదక్ ముంపు ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారని హరీశ్‌రావు తెలిపారు. పలు ప్రాంతాల ప్రజలకు తాగునీరు లేక వాన నీటినే తాగే దుస్థితి ఏర్పడిందని తెలిపారు. పూర్తిగా నీటమునిగిన ధూప్‌సింగ్ తండావాసులు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. వరదల వల్ల అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని సహాయక చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు కోరారు.

