Crime News: విశాఖ జిల్లా భీమిలి మండలం నగరపాలెం గ్రామానికి చెందిన వెంకట జ్యోతిర్మయి అనే మహిళ సాధారణ గృహిణిగానే కనిపించినా, ఆమె వెనుక భయంకర రహస్యం దాగి ఉందని ఎవరు ఊహించలేదు. భర్త రమేష్ సీ-మెన్ ఉద్యోగం కోసం శిక్షణార్థిగా చెన్నై వెళ్ళిన సమయంలో, జ్యోతిర్మయి తన ప్రక్క గ్రామానికి చెందిన రాగాతి రాముతో పరిచయం ఏర్పరుచుకుంది. ఆ పరిచయం క్రమంగా అక్రమ సంబంధంగా మారి, ఆమె కుటుంబం మొత్తం నాశనం అయ్యే దారిని చూపింది.
భర్త హత్య పన్నాగం
శిక్షణ పూర్తయిన రమేష్ తిరిగి ఇంటికి వచ్చాక, భార్య ప్రవర్తనలో మార్పులను గమనించాడు. వరుస ప్రశ్నలతో గొడవలు పెరగడంతో, జ్యోతిర్మయి తన ప్రియుడు రాముతో కలిసి రమేష్‌ను అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రాము తన స్నేహితులు చొక్కా నరేష్, పాడ రాజు అలియాస్ ముక్కు సహాయాన్ని తీసుకున్నాడు.
2015 జూలై 26న రమేష్ మరోసారి భార్యను నిలదీయగా, ఆగ్రహంతో జ్యోతిర్మయి రామును పిలిచింది. వెంటనే రాము, నరేష్, రాజు ఇంటికి వచ్చి, జ్యోతిర్మయి ఇచ్చిన తలుపు చెక్కతో రమేష్ తలకు బలంగా దెబ్బ కొట్టారు. తీవ్ర గాయాలతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.
చిన్నారి హత్య.. మృతదేహం దహనం
ఈ దారుణాన్ని జ్యోతిర్మయి ఆరేళ్ల కుమార్తె సౌమ్య కళ్లారా చూసింది. విషయం బయటపడుతుందనే భయంతో నిందితులు ముందుగా రమేష్ మృతదేహాన్ని భీమిలి బీచ్‌కు తీసుకెళ్లి, పెట్రోల్ పోసి కాల్చేశారు. తర్వాత సాక్షిగా మారవచ్చని భావించి, చిన్నారి సౌమ్యను విజయనగరం పూల్ బాగ్ ప్రాంతంలోని బావిలో పడేసి చంపేశారు.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన నిజాలు
స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. విచారణలో భార్య జ్యోతిర్మయి, ఆమె ప్రియుడు రాము, అలాగే ఇద్దరు స్నేహితులే ఈ ఘోరానికి కారణమని బయటపడింది. విచారణ కొనసాగుతున్న సమయంలోనే రాగాతి రాము యాక్సిడెంట్‌లో మరణించాడు.
కోర్టు తీర్పు
మిగిలిన ముగ్గురిపై విజయనగరం ఎస్సీ/ఎస్టీ కోర్టు న్యాయమూర్తి బి. అప్పలస్వామి కీలక తీర్పు ఇచ్చారు. జ్యోతిర్మయికి జీవిత ఖైదు, నరేష్ మరియు రాజులకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.500 జరిమానా విధించారు.