Pedda Reddy Episode: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గత 16 నెలలుగా తాడిపత్రి నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. వైసీపీ ముఖ్య నాయకులతో పాటు పోలీసులు, న్యాయవ్యవస్థ చుట్టూ తిరుగుతున్నా.. నియోజకవర్గంలోకి మాత్రం అడుగు పెట్టలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం తాడిపత్రిలో ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి హవా నడుస్తుండటమే. “పెద్దారెడ్డి, నీకు చేతనైతే తాడిపత్రిలో అడుగు పెట్టు చూద్దాం” అంటూ జేసీ డైరెక్టుగానే సవాల్ చేస్తున్నారు. “2019 నుంచి 2024 వరకు తాడిపత్రిలో జరిగిన అరాచకాలు మీకు గుర్తు లేవా?” అంటూ అటు వైసీపీతో పాటు పోలీసులనూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. “తాడిపత్రి ప్రజలకు సమాధానం చెప్పి పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి రావొచ్చు” అంటూ జేసీ బరి గీశారు. ఆ బరిని దాటేందుకు జేసీ ఆపసోపాలు పడుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టేందుకు హైకోర్టు అనుమతివ్వడంతో, మరోసారి కేతిరెడ్డి, జేసీ కుటుంబాల మధ్య వివాదం రాజుకుంది. దీంతో మరోసారి తాడిపత్రిలో పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరింది. హైకోర్టు ఆర్డర్ పుచ్చుకుని పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే.. పెద్దారెడ్డి దమ్ముంటే రా, తేల్చుకుందాం అంటూ జేసీ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేతిరెడ్డి, అతడి అనుచరులు చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు ఇవ్వాల్సిందేనన్నారు. అందాకా ఎన్ని కోర్టు ఆర్డర్లు తెచ్చుకున్నా కేతిరెడ్డి తాడిపత్రికి రావడానికి ఒప్పుకోమని తేల్చేశారు జేసీ. పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకు రావడం కాదనీ, ముందు ఆయన అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూడాలని పోలీసులపైనా చిర్రుబుర్రులాడుతున్నారు.
Also Read: Thalapathy Vijay: తమిళ హీరో విజయ్ వ్యాఖ్యలు వైరల్.. రాజకీయ వర్గాల్లో గుబులు
ఆగస్టు 18న పెద్దారెడ్డిని భారీ భద్రత నడుమ ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, జెసి ప్రభాకర్ రెడ్డి ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని తాడిపత్రిలో చేపట్టారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునివ్వడంతో శాంతిభద్రతల విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తలెత్తే అవకాశం ఉందని న్యాయవ్యవస్థను ఆశ్రయించారు. కోర్టు తీర్పు రాకపోవడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు తాడిపత్రి కాకుండా సొంత గ్రామం తిమ్మంపల్లికి తీసుకువెళ్లారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలో అడుగుపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతూనే వస్తున్నాయి. ముందు నుయ్యి, వెనక గొయ్యి అనే విధంగా ఉంది ఇప్పుడు పెద్దారెడ్డి పరిస్థితి. ఒకవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నుండి ఒత్తిడి. నియోజకవర్గంలో అడుగుపెట్టే దమ్ము, ధైర్యం లేదా అంటూ జగన్ మండిపడుతున్నారట. 2026 జనవరి కల్లా తాడిపత్రిలో పార్టీ కార్యక్రమాలు మొదలవకపోతే ఆల్టరేట్‌గా వేరే నాయకుడిని చూసుకుంటామని కూడా జగన్ డెడ్‌లైన్ పెట్టినట్టు సమాచారం. మరోవైపు పెద్దారెడ్డి ఇప్పటికే ఐదారు సార్లు నియోజకవర్గంలోకి వెళ్లడానికి ప్రయత్నం చేసినా ఫలించలేదు. చివరకు న్యాయవ్యవస్థ ద్వారా ప్రయత్నం చేసినా అక్కడా బెడిసి కొట్టింది. “సమయం లేదు మిత్రమా.. రణమా, శరణమా” అనే విధంగా ఉంది ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి. చూడాలి మరి, పెద్దారెడ్డికి మోక్షం ఎప్పుడో, ఆయన తాడిపత్రిలో అడుగు పెట్టేది ఎప్పుడో.