AP News: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం పెరుగుతూ ఉండటంతో, అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం నీటిమట్టం 11.75 అడుగులకు చేరగా, బ్యారేజ్‌లోని 175 గేట్ల ద్వారా 10 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన భద్రాచలం, పోలవరం నుండి కూడా భారీగా నీరు వస్తుండటంతో, రానున్న గంటల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వరదతో లంక గ్రామాల్లో కష్టాలు
గోదావరి వరద ఉధృతి కారణంగా పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న లంక గ్రామాల్లో నివసించే మత్స్యకారులు, ఇతర ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరద ప్రమాదం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు దాదాపు 300 మందిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు.
రాకపోకలకు అంతరాయం.. అప్రమత్తంగా ఉండాలని సూచన
వరద ప్రవాహం పెరగడం వల్ల పి.గన్నవరం మండలంలోని లంక గ్రామాల్లో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. రహదారుల మీదకు నీరు చేరడంతో వాహనాలు వెళ్లడం కష్టంగా మారింది. మరోవైపు, రాజమండ్రి వద్ద ఉన్న రైల్వే వంతెనల దగ్గర కూడా వరద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన అధికారులు తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.