Goa: 1947 ఆగస్టు 15.. భారతదేశం అంతటా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. బ్రిటీష్ ప్రభుత్వం నుంచి విముక్తి పొందిన రోజ కావడంతో దేశవ్యాప్తంగా ఏటా స్వాతంత్య్ర దిన వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. కానీ, దేశంలోని అంతర్భాగమైన గోవాకు మాత్రం 1947లో స్వాతంత్య్రం సిద్ధించలేదు. దీనికి ఒక చారిత్రక కారణం ఉన్నది. దాని గురించి సవివరంగా తెలుసుకుందాం.
Goa: భారత దేశం అంతటికీ 1947, ఆగస్టు 15న నాటికి బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్య్రం సిద్ధించగా, దేశ అంతర్భాగంలో ఉన్న గోవా మాత్రం అప్పటికి పోర్చుగీసు పాలనలోనే మగ్గిపోతున్నది. మరో 14 ఏళ్ల వరకూ కూడా పరాయి పాలనలోనే గోవా మగ్గింది. అప్పటి వరకు భారతదేశమంతా స్వపరిపాలనలో అడుగులు వేస్తున్నా, పోర్చుగీసు పాలనలోనే ఉండిపోయింది.
Goa: 1961 డిసెంబర్ 19 వరకు గోవా వలన పాలనలోనే ఉన్నది. 1510 నుంచి గోవా పోర్చుగీసు కాలనీగా ఉన్నది. 1600లో బ్రిటీష్ వారు భారతదేశంలో అడుగు పెట్టడానికి చాలా కాలం ముందు నుంచి వలస ప్రాంతంగా మారింది. ప్రధానంగా దేశవ్యాప్తంగా పరాయి పాలనపై ఉద్యమం ఉవ్వెత్తున సాగితే, గోవాలో మాత్రం యూరోపియన్ శక్తులకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం సాగలేదు.
Goa: భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నేతృత్వంలో గోవాను విముక్తం చేయడానికి అనేక చర్చలు జరిగాయి. అయినా అవి విఫలమయ్యాయి. గోవాను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధించాలని దశాబ్దాల వలస పాలనను ముగించాలని ఆనాటి నెహ్రూ ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకున్నది. దానికోసం ప్రణాళిక రచించింది.
Goa: గోవాలో పోర్చుగీసు పాలనను అంతమొందించడానికి సైనిక జోక్యం అవసరమని ఆనాటి నెహ్రూ ప్రభుత్వం భావించింది. 1961 డిసెంబర్ 18న భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం సంయుక్తంగా సాయుధ చర్యకు ఉపక్రమించాయి. దీనికి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టారు. త్రివిధ దళాలు గోవా వైపునకు కదిలాయి.
Goa: భారతదేశం సైనిక చర్యకు దిగిన సమయంలో గోవాలో కేవలం 3,300 మంది పోర్చుగీసు సైనికులు మాత్రమే ఉన్నారు. పెద్ద ఎత్తున త్రివిధ దళాలు వెళ్లడంతో పోర్చుగీసు భారతదేశానికి తలవంచాల్సి వచ్చింది. పదవీచ్యుతుడైన గవర్నర్ జనరల్ మాన్యుయేల్ ఆంటోనియో వస్సలో-ఇ సిల్వా లొంగిపోయారు. డిసెంబర్ 18న సాయంత్రం 6 గంటలకు సచివాలయం ముందు ఉన్న పోర్చుగీసు జెండాలను తొలగించి, లొంగిపోతున్నట్టు సూచించే తెల్ల జెండాను ఎగువరేశారు.
Goa: ఈ గోవా విముక్త పోరాటంలో ఏడుగురు భారత సైనికులు ప్రాణాలర్పించారు. వారి జ్ఞాపకార్థం చిహ్నాన్ని నిర్మించారు. డిసెంబర్ 19వ రోజు సచివాలయం ముందు భారత జాతీయ జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి డిసెంబర్ 19న గోవా విముక్తి దినోత్సవంగా జరుపుకుంటారు. ఆనాటి నుంచి ఆగస్టు 15న కాకుండా, డిసెంబర్ 19న వారు గోవా విముక్తి దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.