Pawan Kalyan: పులివెందుల గెలుపు పై పవన్ కీలక కామెంట్స్

Pawan Kalyan: కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట మండలాల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి మద్దతు పొందిన టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఎన్నో ఏళ్ల తర్వాత ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థులకు స్వేచ్ఛగా ఓటు వేయగలిగిన ప్రజాస్వామ్య విజయమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

విజేతలకు అభినందనలు

“జడ్పీటీసీ ఉప ఎన్నికల విజేతలకు హృదయపూర్వక అభినందనలు. పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో ప్రజాస్వామ్యయుత పోటీ ద్వారా వెలువడిన ఈ విజయం స్థానిక ప్రజలకు ఆనందాన్ని తెచ్చింది. విజయం సాధించిన లతా రెడ్డి, ముద్దు కృష్ణా రెడ్డిలను అభినందిస్తున్నాను” అని పవన్ కల్యాణ్ తెలిపారు.

గత పరిస్థితులపై విమర్శలు

గత స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసే అవకాశం కూడా ఇవ్వలేదని, నామినేషన్ వేయదలచిన వారిపై దాడులు, బెదిరింపులు జరిగాయని ఆయన గుర్తుచేశారు. “ఏకగ్రీవం అనే పేరుతో పోటీని అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. పులివెందులలో పోటీ ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ తీర్పు వెల్లడించారు” అని పేర్కొన్నారు.

మూడుదశాబ్దాల తర్వాత స్వేచ్ఛా ఓటు

మూడుదశాబ్దాల తరువాత పులివెందుల ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయగలిగారని పవన్ కల్యాణ్ అన్నారు. ఈసారి నామినేషన్ నుండి పోలింగ్‌ వరకు నియమావళి ప్రకారం ప్రక్రియ సాగిందని, అభ్యర్థులు స్వేచ్ఛగా ప్రచారం చేయగలిగారని వివరించారు.

ప్రతిపక్ష ప్రవర్తనపై వ్యాఖ్యలు

ఎన్నికల ప్రక్రియ నచ్చక ఒక పార్టీ ప్రతి దశలో కవ్వింపు చర్యలకు దిగిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వంపై అసహనంతో అనవసర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. పోలింగ్ సమయంలో హింసకు తావు లేకుండా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బంది, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులందరికీ అభినందనలు తెలిపారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *