Air India

Air India: ఎయిరిండియా విమానంలో బొద్దింకలు.. క్షమాపణ చెప్పిన సంస్థ

Air India: శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్తున్న ఎయిరిండియా విమానం (AI180)లో ప్రయాణికులకు అనూహ్యమైన సమస్య ఎదురైంది. విమానంలో బొద్దింకలు కనిపించడంతో ఇద్దరు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిరిండియా, ప్రయాణికులకు అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు తెలిపింది.

శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబైకి బయలుదేరిన ఈ విమానంలో ప్రయాణికులు బొద్దింకలను గమనించారు. దీంతో వారు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది, ఆ ఇద్దరు ప్రయాణికులను అదే క్యాబిన్‌లోని వేరే సీట్లకు మార్చారు. విమానం కోల్‌కతాలో ఇంధనం నింపేందుకు ఆగినప్పుడు, సిబ్బంది బొద్దింకలు కనిపించిన ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత విమానం ముంబైకి చేరుకుంది.

ఎయిరిండియా వివరణ :
ఈ ఘటనపై ఎయిరిండియా ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. విమానం నిర్వహణ సరిగానే ఉన్నప్పటికీ, కొన్నిసార్లు గ్రౌండ్ ఆపరేషన్స్ సమయంలో కీటకాలు విమానంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఇలాంటివి మళ్ళీ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: WhatsApp Tricks: WhatsApp చాట్‌ను దాచాలనుకుంటున్నారా? ఐతే ఇలా చేయండి..

గత కొంతకాలంగా ఎయిరిండియా తరచూ వార్తల్లో నిలుస్తోంది. టాటా గ్రూప్ యాజమాన్యం స్వీకరించిన తర్వాత కూడా ఈ సంస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోంది. సాంకేతిక లోపాలు, విమానాల ఆలస్యాలు వంటి ఫిర్యాదులు తరచుగా వినిపిస్తున్నాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత, విమానయాన నియంత్రణ సంస్థ DGCA దేశంలోని 8 విమానయాన సంస్థల్లో ఆడిట్లు నిర్వహించింది. ఈ ఆడిట్లలో ఎయిరిండియాలో 93 లోపాలు (19 లెవెల్-1 లోపాలతో సహా) గుర్తించినట్లు DGCA తెలిపింది. లెవెల్-1 లోపాలు భద్రతకు సంబంధించినవి కావడంతో, వాటిని వెంటనే సరిదిద్దాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో, ఎయిరిండియాకు కొత్తగా ఎదురైన ఈ బొద్దింకల సమస్య ఆ సంస్థ నిర్వహణపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *