Eatala Rajendar

Eatala Rajendar: ఆ భయమే ఈటలను వెంటాడుతోందా?

Eatala Rajendar: ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హుజురాబాద్ నియోజకవర్గం పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. గత కొద్ది రోజులుగా ఇక్కడ బీజేపీ అంతర్గత రాజకీయాలు వేడెక్కాయి. అధిష్ఠానం దృష్టికి వెళ్లి కాక పుట్టిస్తున్నాయి. హుజురాబాద్ కేంద్రంగా తనను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడగొట్టడానికి కొందరు యత్నిస్తున్నారంటూ కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. బీజేపీలో ఏ వర్గమూ లేదని, ఉన్నదంతా మోడీ వర్గమే అని… గ్రూపు రాజకీయాలు చేస్తే సహించేది లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇక మరోవైపు ఈటల అనుచరులమైనందుకు తమకు బీజేపీలో ప్రాతినిధ్యం దక్కడం లేదని కొందరు బీజేపీ నేతల రాజీనామా, ఈటెలతో మొరపెట్టుకోవడంతో మొదలైన కుంపటి… ఒక్కసారిగా రగులుకుంది. కొందరు నేతలు ఈటెలను కలిసేందుకు ఏకంగా షమీర్‌పేట్‌లోని ఆయన ఇంటికివెళ్లారు. ఆ సమయంలో ఈటెల చేసిన కామెంట్స్ బీజేపీ అధిష్ఠానాన్నే షేక్ చేసేలా చర్చకు వచ్చాయి. బిడ్డా కరీంనగర్ నా అడ్డా… అంటూ ఈటెల చేసిన కామెంట్స్‌తో బీజీపీ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. సోషల్ మీడియాలో ఎవరెవరైతే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారందరి విషయాలూ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానంటూ ఈటెల హెచ్చరించారు. దాంతో ఒక్కసారిగా అప్పటివరకూ మాట్లాడిన బండి సంజయ్ వర్గం కూడా ప్రస్తుతానికి సైలెంట్ అయిపోయింది. ఈ పరిణామాలతో బీజేపీ రాష్ట్ర అంతర్గత రాజకీయాలు ఇప్పుడు నివురుగప్పిన నిప్పులా మారిపోయాయి.

Also Read: Singanamala MLA Sravani: సైకిల్‌ని రాంగ్‌ ట్రాక్‌లో నడిపిస్తున్న ఆ నెల్లూరు పెద్దారెడ్డి!

ఇదిలా ఉంటే… ఇప్పుడు బండి వర్సెస్ ఈటెల ఎపిసోడ్‌లోకి ఓ కొత్త పర్సన్‌ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే ఈటెలకు మరో చిరకాల ప్రత్యర్థి అయిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రెస్మీట్ పెట్టి ఈటెల రాజేందర్‌పై నిప్పులు చెరిగాడు కౌశిక్ రెడ్డి. ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి మోసగాడు అంటూ కామెంట్ చేశారు. కేసీఆర్‌ను మోసం చేసిన వ్యక్తి అని, హుజురాబాద్ వదిలి వెళ్లిన ఆయన ఇప్పుడు హుజురాబాద్‌పై కపట ప్రేమ నటిస్తున్నారని విమర్శించారు. ఇక మరోవైపు ఈ మధ్య కాలంలో బండి సంజయ్, కౌశిక్ రెడ్డిలు హుజురాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్నారు. తనను కార్నర్ చేసేందుకు బండి సంజయ్, కౌశిక్ రెడ్డిలు కలిసి పని చేస్తున్నారన్న భావనలో ఈటెల రాజేందర్ ఉన్నారట. ఇదే విషయాన్ని మొన్న హుజురాబాద్ నియోజకవర్గం నుంచి తన ఇంటికి వచ్చిన తన అనుచరులతోనూ మాట్లాడినట్టుగా, కౌశిక్ రెడ్డి తీరుపైనా ఫైర్ అయినట్టుగా ఓ ప్రచారం మొదలైంది. ఇప్పుడు బీజేపీలోకి వచ్చాక బండి సంజయ్‌తో ఏ రేంజ్‌లోనైతే ఈటెలకు ప్రతిఘటన ఎదురవుతోందో… హుజురాబాద్ నియోజకవర్గంలోనూ ఆది నుంచి కౌశిక్‌ రెడ్డితో అదే సమరం కొనసాగుతోంది. ఒకరు బీజేపీ, ఇంకొకరు బీఆర్ఎస్ అయినప్పటికీ పార్టీలకతీతంగా తనను టార్గెట్ చేస్తున్నారంటూ ఈటెల భావిస్తున్నట్లు సమాచారం. ఇటు సొంత పార్టీ అయిన బీజేపీలో పోరుతోపాటు బయట పార్టీ అయిన బీఆర్ఎస్‌తో ఏకకాలంలో పోరాడాల్సిన పరిస్థితి ఈటెలకు ఎదురవుతోంది.

ALSO READ  Gujarat: గుజరాత్‌లో భూప్రకంపనలు

ఇప్పటికే ఈటెల వర్సెస్ బండి ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిన తరుణంలో వీరి మధ్యకు మళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పేరు కూడా రావడంతో… ఈటెల కౌంటర్ అటాక్ ఎలా ఉంటుంది… అన్న చర్చకు తెరలేస్తోంది. అదే సమయంలో ఈ రాజకీయ సమరం ఇప్పట్లో ఆగేలా లేదనే భావన బలపడుతోంది. మొత్తానికి హుజురాబాద్ రాజకీయాలు రోజుకో మలుపుతో రసవత్తరంగా మారాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *