Nadendla Manohar: పేదరికం నిర్మూలనకు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలులను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పీ4 – పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం’ అనే వినూత్న, సమగ్ర విధానాన్ని రూపొందించిందని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్‌లో కీలక నిర్ణయాలు
మంగళవారం సచివాలయంలో జరిగిన ‘తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్’ సమావేశం అనంతరం ఆయన పీ4 పోస్టర్‌ను ఆవిష్కరించారు. త్వరలో ఈ కార్యక్రమానికి సంబంధించి పూర్తి సమాచారం కోసం ప్రత్యేకంగా www.zeropovertyp4.ap.gov.in వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఎన్నారైలు, తెనాలి వాసుల భాగస్వామ్యం
పీ4 కార్యక్రమంలో ఎన్నారైలు, ఇతర ప్రాంతాల్లో నివసించే తెనాలి వాసుల సహకారాన్ని తీసుకుంటామని, వారిని భాగస్వాములుగా మారుస్తామని మంత్రి తెలిపారు. దీని ద్వారా మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
2047కు దారి వేసే 2029 లక్ష్యం
2047 అభివృద్ధి విజన్లో భాగంగా, 2029 నాటికి రాష్ట్రంలోని 50 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి బయటపెట్టి అభివృద్ధి పథంలోకి తీసుకురావడం పీ4 ప్రధాన లక్ష్యమని మంత్రి వివరించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని, వారి జీవనస్థాయిని “బంగారు కుటుంబాల” స్థాయికి తీసుకురావడం లక్ష్యమని చెప్పారు.
Also Read: Supreme Court: సంజయ్‌కు 49 పేజీలతో ముందస్తు బెయిల్ తీర్పా? సుప్రీంకోర్టు షాక్
తెనాలిలో పీ4 అమలు ప్రగతిలో
తెనాలి నియోజకవర్గంలో ఇప్పటివరకు 14,280 బంగారు కుటుంబాలు గుర్తించబడ్డాయని, వీరికి సహాయం చేయడానికి 376 మంది దాతలు ముందుకు వచ్చారని, వారు 3,289 కుటుంబాలను దత్తత తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. డేటా నిర్ధారణ అనంతరం, ఈ కుటుంబాలకు ఉపాధి, విద్య, వ్యవసాయ మార్కెటింగ్, రుణాలు, వైద్య సహాయం వంటి అంశాల్లో మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు.
త్వరలో మార్గదర్శకుల పరిచయ సభ
తెనాలిలో త్వరలో మార్గదర్శకులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు, ఈ యాక్షన్ ప్లాన్ తెనాలి నియోజకవర్గానికి మార్గదర్శకంగా నిలవనుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ సంజన సింహా, ఎమ్మార్వోలు గోపాలకృష్ణ, జి. సిద్ధార్థ, ఎంపీడీవోలు దీప్తి, విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతిరావు తదితరులు పాల్గొన్నారు.