ED case on Myntra: ప్రసిద్ధ ఈ-కామర్స్ సంస్థ మింత్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుండి పెద్ద షాక్ తగిలింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించి రూ.1,654 కోట్లకు పైగా అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించి ఈడీ కేసు నమోదు చేసింది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మింత్రాతో పాటు, దాని అనుబంధ సంస్థలు, డైరెక్టర్లపై ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ఈ అభియోగాలు నమోదయ్యాయి.
ఈడీ దర్యాప్తులో మింత్రా “హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ” వ్యాపారం పేరుతో మల్టీ-బ్రాండ్ రిటైల్ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. నిబంధనల ప్రకారం, హోల్‌సేల్ వ్యాపారం చేసే కంపెనీలు తమ ఉత్పత్తులను రిటైలర్లకు లేదా ఇతర వ్యాపార సంస్థలకు మాత్రమే విక్రయించాలి, వినియోగదారులకు నేరుగా అమ్మకూడదు.
Also Read: PM Kisan yojana: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ నిధులు వచ్చేది ఆరోజే!
మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హోల్‌సేల్ వ్యాపారంలో ఉన్నామని చెబుతూ విదేశీ పెట్టుబడిదారుల నుండి రూ.1,654.35 కోట్లు స్వీకరించింది. అయితే, అది తన ఉత్పత్తులను ఎక్కువగా వెక్టర్ ఇ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించింది. ఈ రెండు కంపెనీలు వాస్తవానికి ఒకే గ్రూప్‌నకు చెందినవిగా ఈడీ గుర్తించింది. వెక్టర్ ఇ-కామర్స్ ఆ ఉత్పత్తులను నేరుగా రిటైల్ వినియోగదారులకు విక్రయించింది.
ఎఫ్‌డీఐ నిబంధనల ప్రకారం, హోల్‌సేల్ క్యాష్ అండ్ క్యారీ సంస్థలు తమ గ్రూప్ కంపెనీలకు కేవలం 25% మాత్రమే ఉత్పత్తులను విక్రయించాలి. కానీ, మింత్రా తన ఉత్పత్తులను దాదాపు 100% వెక్టర్ ఇ-కామర్స్‌కు విక్రయించింది. ఒకే గ్రూప్‌నకు చెందిన సంస్థకు ఇలా పూర్తి విక్రయాలు జరపడం ఫెమా నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించినట్లవుతుందని ఈడీ పేర్కొంది. విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి ఈ అక్రమాలను వెలికితీసింది. ఈ కేసు మింత్రాకు తీవ్ర ఇబ్బందులను సృష్టించే అవకాశం ఉంది.