Spain: భారీ వరదలతో స్పెయిన్ దేశం అతలాకుతలం అవుతున్నది. వరద ప్రభావం నుంచి ఇంకా తేరుకోక జనజీవనం స్తంభించింది. వరద మృతుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. శనివారం నాటి వరకు ఆ సంఖ్య 205కు చేరింది. ముఖ్యంగా తూర్పు స్పెయిన్లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలు వరద నీటిలోనే మగ్గుతున్నాయి. చాలా మంది గల్లంతైన వారి ఆచూకీ దొరకలేదు. భవనాలు నేలమట్టం అయ్యాయి. వరదల్లో కార్లు, ఇతర వాహనాలు ఎన్నో కొట్టుకుపోయాయి. చాలా చోట్ల ప్రజలు కట్టుబట్టలతోనే మిగిలారు.
భవనాలు, శిథిలాలు, కార్లపై చాలామంది తలదాచుకుంటున్నారు. గత మూడు రోజుల నుంచి ఈ వరదలు ముంచెత్తుతున్నాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. మురుగునీటి వ్యవస్థ విధ్వంసం జరిగింది. విద్యుత్తు, ఇతర సమాచార వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఎక్కడికక్కడ ప్రజా జీవనం అస్తవ్యస్తం అయింది. ఆహారం కోసం పలుచోట్ల అలమటిస్తున్నారు. ఎక్కడికక్కడ వరద సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.