Cm revanth: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టు అంశం ఏ దశలోనూ చర్చకు రాలేదని స్పష్టం చేశారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదుల జలాల విభజన, వినియోగంపై కొనసాగుతున్న విభేదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు, అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఏపీ నుంచి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును నిర్మించాలన్న అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకే రాలేదని రేవంత్ చెప్పారు. అలా ప్రస్తావన రాకపోతే, దాన్ని ఆపాలన్న చర్చే ఉండదని స్పష్టం చేశారు.
ఇది అపెక్స్ కమిటీ సమావేశం కాదని, కేవలం సమన్వయ సమావేశం మాత్రమేనని రేవంత్ అన్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ హక్కులు ఏపీకి సమర్పించారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దే లక్ష్యంతోనే నేడు ఈ చర్చలు జరుగుతున్నాయని వివరించారు.
పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే ఈ సమావేశ లక్ష్యమని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఎవరిపక్షానా మాట్లాడలేదని, కేవలం సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరించిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.